మనదేశ ఓటర్లను, ప్రజలను మోసం చేయడం చాలా తేలిక. ఎందుకంటే మనం అల్ప సంతోషులం. ఏదైనా వస్తువులు రేట్లు భారీగా పెంచి ఆ తర్వాత అందులో ఒక శాతం తగ్గించినా మనం పండుగ చేసుకుని ఆ నాయకులకు, రాజకీయ పార్టీలకు కృతజ్ఞులుగా ఉంటాం. ఉదాహరణకు వరుసగా నాలుగైదు సార్లు విపరీతంగా పెట్రోల్, సిలిండర్ ధరలను పెంచినా ఒకటి రెండు సార్లు పైసల్లో రేట్లు తగ్గితే మనం వీరుడు, శూరుడు అని పరిగణిస్తాం.
ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. ఒకవైపు పెట్రోల్, వైద్యానికి జీఎస్టీలో చోటు కల్పించలేదు. అదే సమయంలో సినిమా థియేటర్లలో టిక్కెట్ల రేట్లను కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చింది. దీనికి రాష్ట్రాల వినోదపు పన్ను అదనపు వడ్డన. దాంతో మల్టీప్లెక్స్‌లే రాజ్యమేలుతున్న సమయంలో ఆయా థియేటర్లలో రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. దీని వల్ల అదనంగా దేశవ్యాప్తంగా వేల కోట్ల ఆదాయం ప్రభుత్వాలకు వస్తోంది.
ఈ విషయమై ఇప్పటికే తమిళనాడు సినీ పరిశ్రమతో పాటు పలువురు దీనికి వ్యతిరేకంగా గళం విప్పారు. ఇక తాజాగా అరుణ్‌జైట్లీ 100రూపాయల పైబడిన టిక్కెట్ల రేట్లపై జీఎస్టీని 28శాతం నుంచి 18శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించాడు. 100 రూపాయల టిక్కెట్ల వరకు జీఎస్టీని 18శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఇప్పటికే బాలీవుడ్ సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
తాజాగా తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు కూడా ఈ నిర్ణయం తీసుకున్నందుకు బిజెపికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ జీఎస్టీ వల్ల ప్రభుత్వానికి తగ్గే ఆదాయం కేవలం 900కోట్లే. అయినా మన ఇండస్ట్రీ అంతా మోదీ వీరుడు, శూరుడు, సినీ పరిశ్రమని బతికించిన వ్యక్తిగా పొగుడుతున్నారు. ఇక ఈ తగ్గిన జీఎస్టీ జనవరి 1 నుంచి అమలులోకి రానుంది.
అంటే జనవరి నుంచి విడుదలయ్యే చిత్రాలు, ముఖ్యంగా సంక్రాంతి రేసులో ఉన్న నిర్మాతల ఆనందానికి హద్దే లేదని చెప్పాలి. అదీ రాజకీయ చాణక్యం అంటే...!