రాంగోపాల్‌వర్మ.. ఆయన ఏదైనా సినిమా చేయడానికి రెడీ అయ్యాడంటే.. కేవలం ఆ సినిమాకి ప్రమోషన్స్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. ప్రస్తుతం ఈయన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం తీస్తూ ఉండటంతో దానిపైనే వివాదాస్పద వీడియోలు, కామెంట్స్, రెచ్చగొట్టే స్టేట్‌మెంట్స్ ఇస్తున్నాడు. అలాంటిది వర్మ తాజాగా తన చిత్రంతో సంబంధం లేని కామెంట్‌ని చేశాడు. ఇటీవల ‘భైరవగీత’ నిర్మించిన ఆయన ఈసారి గీతోపదేశం చేస్తోన్న తరహాలో వ్యక్తిగత స్వేచ్చ గురించి సూక్తులు చెప్పాడు.
ఆయన తాజాగా మాట్లాడుతూ మీటూ ఉద్యమంపై స్పందించాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను కొత్త చాన్స్ ఇచ్చే వారిని, తన చిత్రాలలో నటించేవారిని ‘వాడుకుంటానని’.. కానీ వారిని బలవంతం చేయడానికి, వారిని ఒప్పించడానికి టైం వేస్ట్ చేసుకోనని తెలిపాడు. అదంతా సమయాన్ని వృధా చేయడమేనని, తాను డైరెక్ట్‌గా ఏదైనా అడిగేస్తానని చెప్పిన ఆయన ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా తన గురించి ఎవరూ కంప్లైట్ చేయడం లేదని కాస్త వ్యంగ్యంగా తెలిపాడు. తాజాగా ఆయన ఈసారి మీటూ ఉద్యమం గురించి మాట్లాడుతూ కొత్త లాజిక్‌ని అందునా దాసరి డైలాగ్స్‌ని తెరపైకి తెచ్చాడు.
మీటూ ఉద్యమం వల్ల కొందరమ్మాయిలకు న్యాయం జరుగుతుంది. కష్టం ఎదురైతే ఎలా స్పందించాలనే విషయం వారికి తెలిసి వచ్చింది. అయితే ఈ పరిస్థితి మారుతుందని నేను అనుకోవడం లేదు. మగాడి నైజం ఎప్పటికీ మారదు. నా దృష్టిలో యాక్షన్ సినిమా చూసినా, పోర్న్ సినిమా చూసినా ఒక్కటే. మద్యం తాగితే, పొగతాగితే చనిపోతారు తప్ప పోర్న్ సైట్ చూస్తే చావరు.
అనైతికం, తప్పు అంటూ కొన్నింటిని ప్రజలపై రుద్దేస్తున్నారు. శృంగారాన్ని చట్టబద్దం చేసిన దేశాలలోనే నేరాల శాతం తక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దాసరి దర్శకత్వం వహించిన ‘కళ్యాణి’ చిత్రంలో ఓ డైలాగ్ ఉంది. ఆ సినిమాలో ఓ గాయని తాను పాట పాడినందుకు డబ్బు తీసుకుంటుంది. గొంతుని అమ్ముకుని డబ్బు తీసుకుంటే లేనిది శరీరాన్ని అమ్ముకుని డబ్బు తీసుకుంటే అది వ్యభిచారం ఎలా అవుతుంది? అనే పాయింట్ ఉంది.
ఓ రకంగా ఆలోచిస్తే ప్రపంచంలో ఏదీ నేరం కాదు. వ్యక్తిగత స్వేచ్ఛకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన దేశాలే అభివృద్దిలో ముందున్నాయి. ఇటీవలికాలంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పులు వ్యక్తిగత స్వేచ్చను పెంచేలా ఉన్నాయని.. అంటూ గీతోపదేశం చేశాడు. మరి దీనిపై మిగిలిన వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సివుంది....!