స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీని పెట్టిన అతి తక్కువ వ్యవధిలోనే అధికారంలోకి వచ్చి సీఎంగా పదవిని చేపట్టడం నాడు పెద్ద రికార్డు. దీనిని గిన్నిస్‌బుక్‌లో కూడా ఎక్కించారు. అయితే ఎన్టీఆర్ అనారోగ్యం కారణంగా విదేశాలకు వెళ్లిన సమయంలో నాటి ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ అండదండలు, నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్‌కి గవర్నర్‌గా ఉన్న రామ్‌లాల్‌ల అండతో ఎన్టీఆర్‌ని పదవీచ్యుతుడిని చేసి నాదెండ్ల భాస్కర్‌రావుని ఢిల్లీ పెద్దలు ముఖ్యమంత్రిని చేశారు. దాంతో ఎన్టీఆర్ మరోసారి ప్రజాతీర్పు కోసం పోరాడి ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో మరోసారి సీఎం పీఠంపైకి అధిరోహించి, ప్రజాస్వామ్య సత్తా చాటిచూపాడు. ఇక విశేషం ఏమిటంటే ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కర్‌రావు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. దాంతో ఆయన సామాజిక వర్గం వారు కూడా ఎన్టీఆర్‌ని పదవీచ్యుతుడిని చేసిన నాదెండ్లను అసహ్యించుకున్నాడు.
ఇక విషయానికి వస్తే ఎన్టీఆర్ బయోపిక్ అంటే అందునా ఆయన సినీ స్టార్‌గా గడిపిన జీవితం గురించి తీసిన ‘కథానాయకుడు’ కంటే ఆయన రాజకీయ జీవితంపై తీస్తున్న ‘మహానాయకుడు’లో మాత్రం నాదెండ్ల ప్రస్తావన ఖచ్చితంగా ఉండి తీరుతుంది. దానిని కూడా చూపించకపోతే ఇక ఎన్టీఆర్ బయోపిక్‌కి అర్ధమే ఉండదు. తాజాగా దీనిపై నాదెండ్ల భాస్కర్‌రావు స్పందించాడు. ఎన్టీఆర్ బయోపిక్‌లో తన గురించి చెడుగా చూపిస్తే తాట తీస్తానని హెచ్చరించాడు. 1984 ఆగష్టు15న దొడ్డిదారిన సీఎం అయిన నాదెండ్ల తన గురించి తప్పుగా చూపిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పడమే కాదు.. నన్ను నెగటివ్‌గా చూపించరాదని ఇప్పటికే యూనిట్‌కి లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపాడు.
ఇక ఈ విషయంలో నాదెండ్లభాస్కర్‌రావుకి జనసైనికుల అండ, మద్దతు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే పవన్ తల్లి కూడా నాదెండ్లను ప్రశంసించింది. నాదెండ్ల భాస్కర్‌రావు కుమారుడైన నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం జనసేనలో కీలకనేతగా ఉన్నాడు. ఇదే విషయమై ఇటీవలే వర్మ మాట్లాడుతూ, ఎన్టీఆర్ పక్కన ఎలా నవ్వుతూ నాదెండ్లభాస్కర్‌రావు నిలుచుని ఆయనను వెన్నుపోటు పొడిచాడో.. రాబోయే రోజుల్లో నాదెండ్ల మనోహర్ కూడా పవన్‌ని వెన్నుపోటు పొడవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.