టాలీవుడ్‌లో సమ్మర్ సీజన్ తర్వాత అత్యంత గట్టి పోటీ ఉండే సీజన్ సంక్రాంతి. దాదాపు 10రోజులకు పైగా పిల్లలకు స్కూళ్ల సెలవులు, మూడు రోజుల పెద్దపండుగ మూడ్‌లో పెద్దలు ఉండటంతో ఈ రోజుల్లో విడుదలైన చిత్రాలకు మినిమం గ్యారంటీ ఉండేది. సంక్రాంతికి మూడు కాదు.. ఏకంగా నాలుగైదు చిత్రాలను కూడా తట్టుకుని, విజయం అందించే స్టామినా ఉందని దర్శకనిర్మాతలు, హీరోలు భావిస్తూ ఉంటారు. ఏకంగా బడా బడా స్టార్స్ కూడా పోటీ పడి మరీ సంక్రాంతికి వస్తుంటారు. ఇక 2018 విషయానికి వస్తే సంక్రాంతి సీజన్‌బాగా నిరుత్సాహపరిచింది. నాలుగైదు చిత్రాలను తట్టుకునే శక్తి ఉన్నా కూడా పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల ‘అజ్ఞాతవాసి’, బాలకృష్ణ ‘జైసింహా’, రాజ్‌తరుణ్ ‘రంగుల రాట్నం’, సూర్య ‘గ్యాంగ్’ వంటి చిత్రాలు వచ్చాయి. వీటిలో ఏదీ నిఖార్సయిన హిట్‌గా నిలవలేదు. కేవలం ‘జైసింహా’ మాత్రమే బి, సి సెంటర్లలో ఓకే అనిపించింది. అయినా అది కూడా యావరేజ్ కిందనే లెక్క.
ఇదే విధంగా రాబోయే అంటే 2019సంక్రాంతికి కూడా వరుసగా నాలుగు రోజుల్లో నాలుగు చిత్రాలు విడుదల కానున్నాయి. జనవరి 9వ తేదీన బాలకృష్ణ-క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్‌లోని మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ విడుదల కానుంది. జనవరి 10న ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘పెట్టా’, జనవరి 11 రామ్‌చరణ్-బోయపాటిశ్రీనుల ‘వినయ విధేయ రామ’, జనవరి 12న వెంకటేష్-వరుణ్‌తేజ్‌లు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ‘ఎఫ్ 2’లు విడుదల కావడం ఖరారైంది.
ఇక సంక్రాంతి హీరోగా కృష్ణ తర్వాత బాలకృష్ణ పేరుతెచ్చుకోవడం, గతంలో బాలయ్య-క్రిష్‌ల కాంబినేషన్‌లో వచ్చిన బాలయ్య 100వ ప్రతిష్టాత్మక చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ పెద్ద విజయం సాధించడం, ఇప్పుడు అదే కాంబినేషన్‌లో ‘కథానాయకుడు’ వస్తూ ఉండటం, సంక్రాంతి దిల్‌రాజుకి కూడా బాగా కలిసి రావడం, ఇప్పుడిప్పుడే సంక్రాంతి సీజన్‌ని తనకి అనుకూలంగా మార్చుకోవాలని ఆరాటపడుతోన్న రామ్‌చరణ్.. ఇలా పోటీ కోడిపందెంల కంటే రంజుగా ఉంది. కంటెంట్ ఎంత బాగున్నా బ్లాక్‌బస్టర్ టాక్ రాకపోతే మాత్రం ఈ చిత్రాలకు పోటీ వల్ల భారీగా ఓపెనింగ్స్‌కి కలెక్షన్లు చీలిపోయి నిర్మాతలు నష్టపోయే అవకాశాలను కూడా కాదనలేం.