ఎప్పుడూ ఒకేలా వుంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. సృజనాత్మక రంగమైన సినిమా పరిశ్రమలో ఎప్పుడూ ఒకే తరహా పాత్రల్లో కనిపిస్తే ఇక ఇంటిదారి పట్టాల్సిందే. ఈ విషయాన్ని చందమామ కాజల్ అగర్వాల్ బలంగా నమ్మినట్టుంది. అందుకే దీపం వుండగానే ఇల్లు కక్కబెట్టుకున్నట్టు కొత్త అడుగులు వేస్తోంది. కెరీర్ తొలి దశలో నటనకు అవకాశం వున్నఒకటి రెండు చిత్రాల్లో కనిపించి ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్ ఆ తరువాత కమర్షియల్ కథానాయికగా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కోటికిపైగా పారితోషికాన్ని దక్కించుకున్న కాజల్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి పేరే తెచ్చుకుంది.
తెలుగులో కాజల్ తన ప్రయాణాన్ని ప్రారంభించి అప్పుడే పదేళ్లు పూర్తయ్యాయి. ఎప్పటికప్పుడు తన క్రేజ్‌ని పెంచుకుంటూ అగ్ర కథానాయకుల చిత్రాల్లో ఆఫర్‌లు దక్కించుకుంటోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి ఇప్పటి వరకు 53 సినిమాలు చేసిన కాజల్ ఇక నుంచి కొత్త తరహా పాత్రల్లో కనిపించడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది కాజల్ చేసిన సినిమాల్లో అత్యధిక శాతం పరాజయాన్నే చవిచూశాయి. దీంతో తన హవా తగ్గిపోతోందని గుర్తించిన ఆమె నెగెటీవ్ షేడ్స్ వున్న పాత్రతో తన సత్తాని మరోసారి చాటుకోవడానికి సిద్ధమవుతోంది.
కాజల్ ప్రయోగం అనుకుని చేసిన `అ!`, కల్యాణ్‌రామ్‌తో చేసిన ఎంఎల్ఎ, భారీ పారితోషికం పుచ్చుకుని బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేసిన `కవచం` చిత్రాలు ఆశించిన ఫలితాల్ని అందించలేకపోవడంతో ప్రస్తుతం తేజ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో ఖచ్చితంగా హిట్‌ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో వుందట. ఈ చిత్రంలో డబ్బంటే అమితంగా ఆశపడే అమ్మాయిగా, నటనకు ఆస్కారమున్న పాత్రలో కనిపించబోతోంది. ఈ పాత్రలో ప్రతినాయిక ఛాయలుంటాయని, ఈ సినిమాతో కాజల్ మళ్లీ పుంజుకోవడం ఖాయమని చెబుతున్నారు. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు.