దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శైలి భిన్నంగా ఉంటుంది. ఏదో కొన్ని చిత్రాలు తరుణ్, నితిన్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ వంటి వారితో చేసినా ఆయన దృష్టిలో పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, అల్లుఅర్జున్ వంటి వారికే అగ్రపీఠం. ఇక మహేష్‌బాబుని పక్కనపెడితే ఈయన ఓట్లని మెగాహీరోలకే వేస్తుంటాడు. త్వరలో అల్లుఅర్జున్‌తో ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత హ్యాట్రిక్ చిత్రం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఆయన ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని లైన్‌లో పెట్టాడు. పవన్‌కళ్యాణ్ రాజకీయాలలో బిజీ అవ్వడంతో ఆ స్థానాన్ని మాటల మాంత్రికుడు మెగాస్టార్‌తో పూరిస్తున్నాడనే చెప్పాలి.
గతంలో టి.సుబ్బిరామిరెడ్డి వంటి పారిశ్రామికవేత్త, బడా నిర్మాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌లతో ఓ మల్టీస్టారర్ తీయనున్నానని ప్రకటించాడు. కానీ దానిపై ఎలాంటి అప్‌డేట్ లేదు. అదేదో పబ్లిసిటీ స్టంట్‌గా కొంతకాలం మీడియాలో, ప్రముఖులు, ప్రేక్షకుల నోళ్లలో నానింది. ఆ చిత్రం గురించి సుబ్బరామిరెడ్డి తప్ప చిరు గానీ, పవన్‌గానీ నోరు విప్పలేదు. ఇక తాజాగా ఆ అదృష్టం నిర్మాత దానయ్యకి లభించిందనే చెప్పాలి. దానయ్య వరుసగా మహేష్‌తో ‘భరత్ అనే నేను’, ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’, రాజమౌళితో సంచలనాత్మక మల్టీస్టారర్‌గా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలు చేస్తున్నాడు. ఇక గతంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ అలియాస్ చిన్నబాబు తాను ఈ బేనర్‌లో చేసే చిత్రాలన్నీ త్రివిక్రమ్‌తోనే ఉంటాయని ప్రకటించాడు. ఇప్పుడు మాత్రం సీన్ మారింది. దానయ్య లైన్‌లోకి వచ్చాడు. ఈ చిత్రంతో దానయ్యకి అగ్రనిర్మాతగా ఉన్న క్రేజ్ మరింతగా పెరగడం ఖాయం. ఈ చిత్రాన్ని రామ్‌చరణే సెట్ చేశాడని స్వయంగా చిరు అనౌన్స్ చేశాడు.
‘వినయ విధేయ రామ’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకు సామాన్యంగా తన చిత్రాలు, పవన్ చిత్రాల ఫంక్షన్స్‌కి తప్ప పెద్దగా హాజరయ్యే అలవాటు లేని త్రివిక్రమ్ అటెండ్ కావడంతోనే ఈ వార్త బాగా హల్ చల్ చేసింది. చివరకు అదే నిజమైంది. గతంలో చిరంజీవి హీరోగా విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ‘జై చిరంజీవా’ చిత్రానికి రచయితగా త్రివిక్రమ్ పనిచేశాడు. కానీ ఆ చిత్రం అనుకున్న స్థాయి విజయం సాధించలేదు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి తన 151వ ప్రతిష్టాత్మక చిత్రంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా.. నరసింహారెడ్డి’ని సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మాతగా చేస్తున్నాడు. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరు ఓ సోషల్ మెసేజ్ కం కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేయనున్నాడు. అలా తీసుకుంటే చిరు 153వ చిత్రంగా చాలా వ్యవధి తర్వాత అంటే 2020 ప్రారంభంలోనే త్రివిక్రమ్ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది.