కేటీఆర్.. కల్వకుంట్ల తారకరామారావు. యంగ్ పొలిటీషియన్‌గా ఈయన దేశవ్యాప్తంగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. వేటిపైన అయినా వెంటనే స్పందించడంతో పాటు ప్రత్యర్ధులపై సరైన టైమింగ్‌లో అత్యంత అద్భుతమైన కౌంటర్లను ఇవ్వడంలో ఆరితేరారు. ఇటీవలే ఈయన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావడంతో కేసీఆర్ రాజకీయ వారసుడి విషయంలో హరీష్‌రావు, కవితలపై వస్తున్న వార్తలకు కూడా చెక్‌పడింది. కేసీఆర్ తర్వాత ఆ స్థానం కేటీఆర్‌దేనని స్పష్టమైంది. ఇక మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కి, కేటీఆర్‌కి మంచి స్నేహం ఉంది. గతంలో వరుస పరాజయాల్లో ఉన్న సమయంలో రామ్‌చరణ్ నటించిన ‘ధృవ’ చిత్రం వేడుకకి కేటీఆర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యాడు. తాజాగా రామ్‌చరణ్-బోయపాటి శ్రీనుల ‘వినయ విధేయ రామ’కి కూడా మెగాస్టార్‌తో కలిసి ముఖ్య అతిధిగా హాజరుకావడం, ఈ రెండు వేడుకలు ఒకే వేదికపై జరగడం సెంటిమెంట్ దృష్ట్యా బాగా ఆసక్తినే రేపుతోంది.
ఇక ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ వేడుకలో ఆడియో సీడీని కేటీఆర్ విడుదల చేయగా, చిత్రం ట్రైలర్‌ని మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్‌లు ఇద్దరు విడుదల చేశారు. అల్లుఅరవింద్ ఈ వేడుక ప్రీరిలీజ్ ఈవెంట్‌లా లేదని, విజయోత్సవ సభలా ఉందని పొగిడాడు. ఇక వేడుక వేదికపై తన బాబాయ్, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అభిమానులను కూడా రామ్‌చరణ్ ఎంతో తృప్తి పరిచాడు. చెప్పను.. మాట్లాడను అంటూ ఎక్స్‌ట్రాలు పోకుండా బాబాయ్ పడుతున్న కష్టం గురించి చెబుతూ.. ఆయన ఎక్కడ ఉన్నా వేదికపై ఎంత మంది ఉన్నా తన మనస్సంతా బాబాయ్ వెంటనే ఉందని చెప్పడంతో బాగా జోష్ నిండింది. ఇక ఈ వేడుకలో కేటీఆర్ చేసిన ప్రసంగం.. మరీ ముఖ్యంగా ఎవ్వరూ ఊహించని విధంగా రామ్‌చరణ్ రాజకీయాల గురించి ఇచ్చిన హింట్‌తో మెగాభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
ఇప్పటికే మెగాపవర్‌స్టార్‌గా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా పలు బాధ్యతలు మోస్తున్న చరణ్ ఈ వేదికపై రాజకీయ నాయకుల కంటే అద్భుతంగా మాట్లాడాడని, అతడికి మంచి భవిష్యత్తు ఉందని (రాజకీయంగా)దానికి టైం ఉంది... కొంత టైం ఉందిలే అని కేటీఆర్ అనడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. బహుశా వచ్చే ఏపీ, లోక్‌సభ ఎన్నికల నాటికి తన బాబాయ్ పవన్‌కళ్యాణ్‌కి బహిరంగంగా మద్దతు ఇవ్వడమే కాదు.. బాబాయ్ కోసం ప్రచారం చేసే అవకాశం ఉందని ఈ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. ఇక కేటీఆర్ విషయానికి వస్తే సినీ సెలబ్రిటీలతో ఆయన మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో ఆయన ‘భరత్ అనే నేను’ చిత్ర ప్రమోషన్స్‌లో తనవంతు కీలకపాత్రను పోషించాడు.
కానీ మరోవైపు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రభాస్ గెస్ట్‌హోస్ విషయంలోనూ, తాజాగా మహేష్‌కి కూడా జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ షాకిచ్చింది. ఆయనకు ఆదాయ పన్ను చెల్లింపు విషయంలో నోటీసులు ఇవ్వడమే కాకుండా, ఆయన బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసింది. మరి కేటీఆర్, కేసీఆర్, టిఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు చూస్తుంటే పేకాట పేకాటే.. బామ్మర్ది బామ్మర్దే అన్న విధంగా ఉందని అనిపిస్తోంది. సినీ నటుల విషయంలో చంద్రబాబు ఉన్నంత ఉదాహరంగా టీఆర్‌ఎస్ ఉండదని తేలిపోయింది. మరి రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రామ్‌చరణ్, మెగా ఫ్యామిలీ విషయంలో కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే.. ఇంతే కఠినంగా వ్యవహరిస్తుందా? లేదా? అనేవి వేచిచూడాల్సివుంది....!