సాధారణంగా యావరేజ్ హిట్టు కొట్టిన డైరెక్టర్స్ అందరికి సైతం ఇండస్ట్రీలో భీభత్సమైన క్రేజ్ ఉంటుంది. అలాంటిది గీత గోవిందం లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన పరశురామ్ గారికి క్రేజ్ మామూలుగా ఉంటుందా చెప్పండి. కానీ.. తనకు లైఫ్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే తన తదుపరి సినిమా కూడా చేసి.. ఆ బ్యానర్లో హ్యాట్రిక్ సినిమాలు చేసిన ఏకైక డైరెక్టర్ గా పేరు సాధించాలన్న ధ్యేయంతో అల్లు కాంపౌండ్ లోనే క్విక్ ఫిక్స్ వేసుకొని అతుక్కుపోయాడు పరశురామ్.
అసలు సమస్య అక్కడే వచ్చిపడింది. పరశురామ్ టాలెంట్ మీద అపారమైన నమ్మకం ఉన్న అల్లు అరవింద్.. పరశురామ్ దర్శకత్వంలో మెగా హీరోల్లో ఎవర్ని హీరోగా పెట్టి సినిమా తీయాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. మొదట వరుణ్ తేజ్ పేరు వినిపించింది కానీ.. వరుణ్ డేట్స్ ఇప్పుడప్పుడే దొరికేలా లేవు. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ అనుకున్నారు. కానీ.. ప్రస్తుతం కిషోర్ తిరుమలతో ఒక సినిమా చేస్తున్న తేజ్ కూడా ఆ సినిమా అనంతరం భాగమతితో బంపర్ హిట్ అందుకొన్న జి. అశోక్ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకొన్నాడు.
ఇదంతా పక్కన పెడితే.. పరశురామ్ సారుకి బన్నీని డైరెక్ట్ చేయాలన్నది జీవితాశయం. బట్.. బన్నీ ఏమో త్రివిక్రమ్ సినిమా సైన్ చేశాడు. వచ్చే నెల నుంచి ఆ ప్రాజెక్ట్ మొదలవుతుంది. సో, ఇప్పుడు గీతా ఆర్ట్స్ కాంపౌండ్ ఏ హీరోతో సినిమా చేయాలా అని తెగ ఆలోచించేస్తున్నాడు పరశురామ్. పాపం అల్లు అరవింద్ కూడా ఈ కన్ఫ్యూజన్ కి ఒక ఆన్సర్ చెప్పలేకపోతున్నాడట. మరి పరశురామ్ తదుపరి చిత్రం విషయంలో క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదేమో.