పవన్‌కళ్యాణ్ రాజకీయాలకే పరిమితమైన తర్వాత టాలీవుడ్ సూపర్‌స్టార్ ఎవరు? అని ప్రశ్నిస్తే ఎవరైనా ఠక్కున ‘మహేష్‌బాబు’ పేరు చెబుతారు. బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫ్లాప్‌లను మరిచేలా కొరటాల శివతో ‘శ్రీమంతుడు’ తర్వాత ‘భరత్ అనే నేను’గా ముందుకు వచ్చి ఈ ఏడాది పెద్ద హిట్ కొట్టాడు. దీని తర్వాత తనతో గతంలో సినిమాలు తీసి నష్టపోయిన పివిపి సంస్థ, వైజయంతీ మూవీస్‌ని దిల్‌రాజుతో కలిపి వంశీపైడిపల్లి డైరెక్షన్‌లో తన ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా ‘మహర్షి’ చేస్తున్నాడు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో పూర్తయింది. వచ్చే నెల నుంచి చివరి షెడ్యూల్ జరగనుంది. ఆ వెంటనే మహేష్, పూజాహెగ్డేలపై సాంగ్స్‌ని కూడా ప్లాన్ చేసి ముందుగా అనుకున్నట్లు వేసవి కానుకగా మొదటి చిత్రం ఏప్రిల్5న విడుదల చేయనున్నారు.
ఈ మూవీలోని ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఎమోషన్స్, ఫీల్ మిస్ కాకుండానే ఎంతో సెన్సిబుల్‌గా మహేష్ అమెరికా నుంచి ఇండియాకి ఎందుకు వచ్చాడు? ఆ సందర్భంగా జరిగే భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ బ్యాంగ్‌ని వంశీ పైడిపల్లి హృద్యంగా తీశాడని సమాచారం. ముగ్గురు భారీ నిర్మాతలు కావడంలో ఖర్చుతో పాటు దేనికి రాజీ పడటంలేదు. అల్లరినరేష్ ఇందులో కీలకపాత్రను పోషిస్తున్నాడు. ఇక మూవీకి సంబంధించిన ఓ సాంగ్ బిట్ ఆన్‌లైన్‌లో లీకయిందని వార్తలు వస్తున్నాయి. దాంతో వెంటనే యూనిట్ నష్ట నివారణ చర్యలు చేపట్టడంతో పాటు షూటింగ్ సమయంలో సెల్‌ఫోన్స్, ఎడిట్ టేబుల్ మీద కూడా కఠిన చర్యలు తీసుకుందని తెలుస్తోంది.
ఈ మూవీ తర్వాత మహేష్ సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే సుకుమార్ రెండు స్టోరీలు మహేష్‌బాబుకి వినిపించాడట. కానీ ఈ రెండు తనకి సరిపడా కథలు కావని, ఆ జోనర్ చిత్రాలను కాకుండా కొత్త కథను తీసుకుని రమ్మని సుక్కుని మహేష్ ఆదేశించాడట. ‘మహర్షి’ షూటింగ్ పూర్తయ్యే నాటికి కూడా సుక్కు సరైన కథను అందించలేకపోతే మహేష్ మరో దర్శకుడితో ముందుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.