మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ పరిస్థితి ప్రస్తుతం ఎంతో క్లిష్టంగా ఉంది. ఆయన మొదటి చిత్రం ‘రేయ్’ విషయం పక్కనపెడితే ఆ తర్వాత దిల్‌రాజు అండ సాధించి ఏకంగా ‘పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్‌సేల్, సుప్రీమ్’ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టాడు. దీని వెనుక దిల్‌రాజు అండదండలు, జడ్జిమెంట్ బలంగా పనిచేశాయి. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ల తర్వాత అంతటి ఈజ్ ఉన్న నటునిగా, కాబోయే సుప్రీంహీరోగా ఈయనకు పేరు వచ్చింది. మార్కెట్ కూడా కేవలం మూడే చిత్రాలతో ఏకంగా 25కోట్లను మించింది. ఆ తరుణంలో ఈయనకు యువతరం హీరోలలో తిరుగేలేదని భావించారు. అందరు హీరోలతో కలసిమెలసి ఉండటం, నటనలో, స్టైల్‌లో, డ్యాన్స్‌లు, నటన, ఫైట్స్ వంటి అన్నింటిలో తన మామయ్యల మార్కు ఉండేలా చూసుకుని సక్సెస్ అయ్యాడు. కానీ చివరకు అవే ఆయనకు పెద్దమైనస్ అయ్యాయి. ‘తిక్క, విన్నర్, నక్షత్రం’, దిల్‌రాజు కాస్త సపోర్ట్ చేసినా కూడా ‘జవాన్, ఇంటెలిజెంట్, తేజ్ ఐ లవ్యూ’ వంటి డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు.
ప్రస్తుతం ఆయన ‘నేను..శైలజ’ ఫేమ్ కిషోర్‌తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ ప్రారంభించనున్నాడు. ఇదే సమయంలో దిల్‌రాజు ఈయనను కాస్త పక్కనపెట్టాడు. దాంతో సాయికి మరలా పూర్వవైభవం తెచ్చేబాధ్యతలను మెగాస్టార్ చిరంజీవి అల్లుఅరవింద్‌పై పెట్టాడట. ప్రస్తుతం గీతాఆర్ట్స్ మీద కంటే బన్నీవాస్‌తో కలిసి ‘గీతాఆర్ట్స్ 2’లో ఎక్కువ చిత్రాలు నిర్మిస్తున్న అల్లుఅరవింద్ సైతం ‘గీతగోవిందం’ తర్వాత సాయిధరమ్‌తేజ్ కోసం పరుశురాంని లాక్ చేశారు. మరోవైపు స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ ‘నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ తర్వాత ఎన్నడు లేని విధంగా ఎంతో గ్యాప్ తీసుకున్నాడు. ఆయన తదుపరి త్రివిక్రమ్‌తో చిత్రం చేయాలని భావిస్తున్నా, ఇటీవల పరుశురాం చెప్పిన సబ్జెక్ట్ నచ్చడంలో ఓకే చెప్పాడట.
ఇంకోవైపు అల్లు అరవింద్ మరో కుమారుడు అల్లుశిరీష్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. సో.. ఇటు సాయికి లిఫ్ట్ ఇవ్వాలా? లేక తన కుమారుల సంగతి ముందు చూసుకోవాలా? అనే ధర్మసంకటంలో అరవింద్ ఉన్నాడని తెలుస్తోంది. ఇక తాజాగా సాయిధరమ్‌తేజ్ ‘పిల్ల జమీందార్, భాగమతి’ వంటి చిత్రాల దర్శకుడు అశోక్ చెప్పిన సబ్జెక్ట్‌ని ఓకే చేశాడట. వినూత్నమైన పాయింట్ చుట్టూ తిరిగే ఈ మూవీని ఎవరు నిర్మిస్తారు? అల్లుఅరవింద్ ముందుకు వస్తాడా? లేక వేరే నిర్మాతలే గతా? అనే విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.