దేశముదురు భామ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బొద్దందాలతో, తనదైన చలాకీ నటనతో ఆమె టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. తెలుగులో పలువురు స్టార్స్ సరసన జోడీ కట్టింది. అయినా ఈమెకి తెలుగులో రాని గుర్తింపు తమిళంలో వచ్చింది. తమిళ తంబీలు బొద్దందాలకు పెద్ద పీట వేస్తారనే విషయం తెలిసిందే. దాంతో ఆమె కోలీవుడ్‌లో ఎంతో కాలం టాప్ హీరోయిన్‌గా రాణించింది. కానీ ఇటీవల కాస్త నాజూకుగా మారింది. తెలుగులో స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్, యంగ్‌రెబెల్‌స్టార్ ప్రభాస్, రామ్, రవితేజ వంటి వారితో పాటు తమిళంలో విజయ్‌తో పాటు పలువురు స్టార్స్ చిత్రాలలో జోడీ కట్టి మెప్పించింది. ఇక శింబుతో ఈమె ప్రేమాయణం నాడు హాట్‌టాపిక్‌గా మారింది. బాలనటిగా టివి సీరియల్స్‌లో నటించిన బాలీవుడ్ చిత్రాలలో బాలనటిగా, హీరోయిన్‌గా కూడా నటించిన మరాఠి భామ హన్సిక మోత్వాన్ని ఎట్టకేలకు తన కెరీర్‌లో ఒక మైలు రాయికి చేరువైంది.
ప్రస్తుతం ఆమె హాఫ్ సెంచరీ పూర్తి చేసే క్రమంలో తన 50వ చిత్రంగా ‘మహా’ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇప్పటికే విడుదలై తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఈ పోస్టర్లో సాధ్వి గెటప్‌లో కనిపిస్తున్న హన్సిక హుక్కా పీలుస్తూ ఉండటం ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఇక ఇతర సాధువులు నేలపై కూర్చుని ఉంటే ఆమె కుర్చీలో కూర్చోవడం కూడా వివాద కారణంగా నిలిచింది. ఒక విధంగా చూసుకుంటే ఈమె హీరోయిన్‌గా చేసిన మొదటి చిత్రం ‘దేశముదురు’లో లానే ఈమె సాధ్వి గెటప్‌లో కనిపిస్తూ ఉంది. కానీ ‘దేశముదురు’ పక్కా కమర్షియల్ చిత్రం కాగా ‘మహా’ మాత్రం వెరైటీ కంటెంట్‌తో వస్తున్న చిత్రం కావడం విశేషం. ఇక ‘మహా’ చిత్రం నుంచి తాజాగా యూనిట్ మరో పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో ఆమె ముస్లిం యువతిగా ప్రార్ధన చేస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో మసీదు, తెల్లని పావురాలు, నీడలో హన్సిక తనను తాను కాల్చుకుంటున్న స్టిల్స్ ఉన్నాయి. వివాదాస్పద అంశాలేమీ ఈ పోస్టర్‌లో లేకపోయినా ఇది బాగా ట్రెండ్ అవుతోంది.
ఇక ఈ చిత్ర దర్శకుడు యూఆర్ జమీల్ ఈ మూవీ నుంచి సాధ్వి హుక్కా పీల్చే సన్నివేశం తీసివేస్తామని, తమకు అనవసర వివాదాలు రాజేయాలనే ఉద్దేశ్యం లేదని తెలపడం ముదావహం. ఇక ఈ మూవీకి సంగీతం అందిస్తున్న గిబ్రాన్‌కి సైతం ఇది 25వ చిత్రం కావడం విశేషం. మరి తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి ఫలితం సాధిస్తుంది? ఈ పోస్టర్ల వెనుక ఉన్న మర్మం ఏమిటి? అనేవి ఆసక్తిని కలిగిస్తున్నాయి.