బోయపాటి శ్రీను సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ వుండదు. అయితే... సినిమాలో హీరో ఎంత మందిని నరికాడు...ఎంత మందిని ఒంటిచేత్తో మట్టికరిపించాడు.. భూమి బద్దల్లయ్యే స్థాయిలో ఎలాంటి డైలాగ్‌లు దంచాడు...ఎన్ని బిల్డప్ సీన్లున్నాయి. ఎంత రక్తం ఏరులై పారింది... ఇవీ బోయపాటి సినిమా గురించి.. చెప్పుకునే అంశాలు...ఎంత వెతికినా గొప్ప కథ కనిపించదు సరికదా.. గొప్ప సీన్‌లు వుండవు.. `భద్ర` సినిమా నుంచి రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న `వినయ విధేయ రామ` వరకు బోయపాటి తీరు మారడం లేదు.
ఎంత పెద్ద హీరో దొరికితే అంత భారీ స్థాయి యాక్షన్ సీన్‌లని ప్లాన్ చేస్తున్నాడే కానీ కొత్త కథ చెబుదాం...తను యాక్షన్ చిత్రాలకు తప్ప మరో జోనర్ మూవీస్‌కి పనికి రాడనే అపవాదును చెరిపేద్దాం అని ఏ మాత్రం ఆలోచించడం లేదు. ఎందుకంటే అతనికి మరో జోనర్ టచ్ చేయడం ఇష్టం లేకనా...రాకనా..అన్న అనుమానాలు మాత్రం సగటు ప్రేక్షకుడిని తొలిచేస్తున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ని ఇచ్చినా అదే రొడ్డ కొట్టుడు...సినిమా... పైకి క్లాస్ టైటిల్ పెట్టినా లోపల సరుకు మాత్రం ఊర మాసే.
రామ్‌చరణ్‌ని ఇచ్చినా బోయపాటిలో ఏ మాత్రం మార్పు రాలేదు సరికదా తనలోని ఊరమాస్‌ని మళ్లీ తలుపుతట్టి కరాళ నృత్యం చేయించినట్టున్నాడు. ఆడియో రిలీజ్ కోసం ఇచ్చిన పబ్లిసటీ యాడ్స్ చూస్తేనే రామ్‌చరణ్ చేత బోయపాటి ఏ రేంజ్ మాస్ మసాలా యాక్షన్ సీన్‌లని సినిమా అంతా రంగరించాడో అర్థమవుతోంది. ఈ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్...ఆడియో రిలీజ్‌కు ఇచ్చిన పబ్లిసిటీ డిజైన్స్ చూసిన సగటు ప్రేక్షకుడు మాత్రం బోయపాటి నుంచి ఇంతకు మించి ఏమీ ఆశించలేము అబ్బాయ్ అంటూ నిట్టూరుస్తున్నాడు.