టాలీవుడ్ లో వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న రామ్ చరణ్ బాలీవుడ్ లోనూ జెండా ఎగురవేయాలన్న ఆశతో తెలుగు ప్రొజెక్ట్స్ ను పక్కనపెట్టి హిందీలో ఒక సినిమా చేశాడు. అమితాబ్ బచ్చన్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటైన జంజీర్ రీమేక్ గా భారీ స్థాయిలో రూపొందిన ఈ రీమేక్ అక్కడ మాత్రమే కాదు.. ఇక్కడ అనువాద రూపంలో విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. మళ్ళీ అప్పట్నుంచి చరణ్ బాలీవుడ్ ను టచ్ చేయలేదు. చరణ్ మిస్టేక్ ను గుణపాఠంగా భావించిన చాలామంది యువ హీరోలు బాలీవుడ్ వైపు పరుగులు పెట్టడం మానేశారు.
తాజాగా ఈ లిస్ట్ లో విజయ్ దేవరకొండ కూడా చేరాడు. కాఫీ విత్ కరణ్ షోలో జాన్వీ కపూర్ తనకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని చెప్పడంతో.. విజయ్ క్రేజ్ బాలీవుడ్ కి వెళ్లిపోయిందని అందరూ అతడ్ని ఎత్తేయడం మొదలెట్టారు. దాంతో ఇమ్మీడియట్ గా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ మా హీరో బాలీవుడ్ కి వెళ్ళాలి అని స్లోగన్స్ మొదలెట్టారు. కానీ.. విశ్లేషకులు మాత్రం విజయ్ ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్లకపోవడమే కరెక్ట్ అని తీర్మానించారు. అందుకు కారణాలు కోకొల్లలు.
అయితే.. మొన్న రణవీర్ సింగ్ హీరోగా కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో విజయ్ క్రికెటర్ శ్రీకాంత్ పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆ బాలీవుడ్ న్యూస్ ను విజయ్ సీరియస్ గా తీసుకొన్నాడేమో అనుకున్నారందరూ.
కానీ.. తాజా సమాచారం ప్రకారం విజయ్ ఆ బాలీవుడ్ ఆఫర్ ను తిరస్కరించాడని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో వరుస చిత్రాల్లో బిజీగా ఉన్న విజయ్.. హిందీ ఎంట్రీకి ఇది సరైన సమయం కాదని భావించి ఆ భారీ బాలీవుడ్ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడు. విజయ్ ఆ బాలీవుడ్ ఆఫర్ ను తిరస్కరించడం వలన కొందరు అభిమానులు బాధపడినప్పటికీ.. విజయ్ ప్లాన్ అర్ధం చేసుకొన్నవాళ్లు మాత్రం సంతోషం వ్యక్తం చేశారు.