నేటిరోజుల్లో ప్రతి ఒక్కరికి మీడియా అంటే చులకనైపోయింది. మరీ ముఖ్యంగా సినిమాలు తీయడం చేతకాని వారు, అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేసే వారు కూడా సినిమా రివ్యూలపై మండిపడుతున్నారు. కానీ ఫలితం సేమ్‌గా ఉన్నప్పుడైనా తమ తప్పుని సరిదిద్దుకుంటారనుకోవడం అత్యాశే. అంత బ్రాడ్‌మైండ్ మన టాలీవుడ్ వారికి ఉండదనే చెప్పాలి. సినిమా ఎలా ఉన్నా కూడా అలా ఉంది.. ఇలా ఉంది.. అదిరిపోయే కలెక్షన్లు అంటూ తాము చేసే భజనను అందరు నమ్ముతారని భ్రమిస్తూ, ఆ భ్రమల్లోనే బతుకుతున్నారు. హరీష్‌శంకర్ నుంచి ప్రవీణ్‌సత్తార్ వరకు ప్రతి ఒక్కరు మీడియాకు క్లాస్ పీకే వారే. అసలు రివ్యూలకే అర్ధం పర్ధం లేదని, ఎవ్వరూ ఆ రేటింగ్స్‌ని పట్టించుకోరని భావించే వారు సైతం రివ్యూ రేటింగ్స్ తక్కువగా వస్తే భుజాలు ఎందుకు తడుము కుంటారో వేచిచూడాలి. స్టార్ హీరోలలో కేవలం పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు వంటి వారికి తప్పించి మిగిలిన వారికి మెచ్యూరిటీ లేదనే నిర్ణయానికి రావడానికి కూడా ఇదే కారణం. సినిమా అనేది ప్రైవేట్ ప్రాపర్టీ అని వాదించే వారు సైతం.. జనం వందలు ఖర్చుపెట్టి టిక్కెట్ కొంటారనే చిన్నలాజిక్‌ని మిస్ అవుతున్నారు. వారికి పెట్టుబడికి పెట్టే కోట్లు ఎంత విలువైనవో.. సామాన్యులకు సినిమా థియేటర్‌కి వెళ్లి సినిమా చూడటానికి అయ్యే ఖర్చు కూడా అంతే విలువైందని చెప్పాలి.
ఇక విషయానికి వస్తే శర్వానంద్-సాయిపల్లవి-హనురాఘవపూడిల కాంబినేషన్‌లో వచ్చిన ‘పడి పడి లేచె మనసు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ లాస్ దిశగా రన్ అవుతోంది. ఏదో మొదటి ఒకటి అరా చిత్రాలు తప్పించి ‘లై’ చిత్రంతో పాటు ‘పడి పడి లేచె మనసు’కి కూడా హను రాఘవపూడి భారీగా నిర్మాతల చేత పెట్టుబడి పెట్టించాడు. లావిష్ చిత్రీకరణ, ఎక్కువకాలం షూటింగ్‌లతోపాటు రీషూట్‌లపై చూపిన శ్రద్ద సినిమా కంటెంట్‌పై పెట్టలేకపోయాడు. ఇప్పుడు ఆయన పుణ్యాన కొత్త నిర్మాత నిండా మునిగి అంతర్ధానమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో నిర్మాతల క్షేమాన్ని పట్టించుకుని హనులోనే పూర్తి తప్పు ఉందని చెప్పాలి. అదే సమయంలో శర్వా మాత్రం హ్యాట్సాఫ్ అనిపించుకున్నాడు.
ఈ చిత్రం గురించి మాట్లాడటానికి ఏమీ లేదని, రివ్యూలలో వారు చేసిన విమర్శలలో కూడా తప్పు పట్టేందుకుఏమీ లేదని చెబుతూనే తాను మరింత జాగ్రత్త వహిస్తానని, మీడియా కూడా తనకు వెన్నంటి ఉండాలని నిజాయితీగా కోరి ‘మహానుభాహుడు’ అనిపించుకున్నాడు. శర్వా చిత్రం సూపర్‌హిట్ అయితేనే రూ.25కోట్లు వసూలు చేసే పరిస్థితుల్లో ఏకంగా ఈ చిత్రానికి 35కోట్ల వరకు ఖర్చుపెట్టించిన హనునే తప్పని అందరు ఘంటాపధంగా విమర్శిస్తున్నారంటే దానికి అర్ధం వుంది...!