పాపం ఏ ముహూర్తాన ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన సైజ్ జీరో కోసం బరువు పెరిగిందో కానీ.. ఆ సినిమా విడుదలై మూడేళ్లు పూర్తికావస్తున్నా.. ఆ సినిమా కోసం పెరిగిన కొవ్వును మాత్రం కరిగించలేక నానా ఇబ్బందులూ పడుతోంది మన స్వీటీ అలియాస్ అనుష్క. అప్పటివరకూ అనుష్కను చూసి అబ్బా ఏముందిరా అనుకొనేవాళ్లందరూ ఒక్కసారిగా ఆమెను చూసి ఇలా అయిపోయిందేంటిరా అని షాక్ అయ్యేలా మారిపోయింది అనుష్క. అప్పట్నుంచి బ్యాక్ టు షేప్ రావడానికి నానా ఇబ్బందులుపడుతున్నప్పటికీ.. ఇప్పటివరకూ సరైన ఫలితం లభించలేదు. మధ్యలో కాస్త జిమ్ గట్రా చేసి.. ముఖం కాస్త తగ్గినా.. ఓవరాల్ గా బాడీ స్ట్రక్చర్ లో మాత్రం పెద్దగా మార్పులు రాలేదు.
అయితే.. తాను హీరోయిన్ గా కొనసాగాలంటే అర్జెంట్ గా బరువు తగ్గడం ముఖ్యమని భావించిన అనుష్క యూరప్ లోని ఓ వెల్నెస్ సెంటర్ కి వెళ్ళి మరీ అక్కడ ప్రత్యేకమైన శిక్షణ తీసుకొని సన్నబడడం మొదలెట్టింది. అందుకే గత ఆరు నెలలుగా ఆమె ఎక్కడా కనిపించలేదు. త్వరలోనే కోన వెంకట్ నిర్మాణంలో రూపొందనున్న ఓ ద్విభాషా చిత్రంలో నటించనున్న అనుష్క మరో పదిరోజుల్లో తన కొత్త లుక్ తో అందరికీ దర్శనమివ్వనుంది. ఈ విషయాన్ని కోన వెంకట్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ప్రకటించడం వరకూ బాగానే ఉంది కానీ.. అనుష్క నిజంగానే తగ్గిందా అని కొందరు అనుమానపడుతున్నారు. అందుకు కారణం ఇదివరకు కూడా అనుష్క తగ్గింది అని ప్రచారం జరిగినప్పటికీ.. భాగమతి సినిమాలో ఆమెకు లూజ్ బట్టలు వేసి కవర్ చేయాల్సి వచ్చింది. మరి ఈసారి కూడా అలాగే కవర్ చేస్తారా లేక అనుష్క నిజంగానే తగ్గిందా అనేది ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోనుంది. ఒకవేళ అనుష్క నిజంగానే తగ్గితే మాత్రం ఆమె అభిమానులకు అంతకుమించిన ఆనందమైన విషయం ఏముంటుంది చెప్పండి.