అసలే తన దర్శకత్వంలో తెరకెక్కాల్సిన భారీ బాలీవుడ్ చిత్రం మణికర్ణిక తన చేజారిపోయిందన్న బాధలో ఉన్న క్రిష్ కి ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చింది. కంచె అనంతరం వరుణ్ తేజ్ తో మరో సినిమా కమిట్ మెంట్ ఉన్న క్రిష్.. తన దర్శకత్వంలో ఆ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం లేకపోవడంతో.. నిర్మాతగా మారి వరుణ్ తేజ్, సంకల్ప్ రెడ్డిల కాంబినేషన్ లో అంతరిక్షం చిత్రాన్ని నిర్మించాడు. ఘాజీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన స్పేస్ థ్రిల్లర్ కావడంతో జనాలందరూ సినిమాను విశేషంగా ఆదరిస్తారని నమ్మి వరుణ్ తేజ్ మార్కెట్ రేంజ్ ను మించిన బడ్జెట్ ఖర్చు చేశాడు క్రిష్. గ్రాఫిక్స్ మరియు సీజీ వర్క్ విషయంలో దర్శకుడు సంకల్ప్ రెడ్డి అస్సలు కాంప్రమైజ్ అవ్వకపోవడంతో బడ్జెట్ పెరిగి పెరిగి 25 కోట్ల రూపాయల దాకా అయ్యింది. విడుదల సమయంలో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు చెప్పిన రేట్ కి భయపడి ముందుకు రాకపోవడంతో చాలా ఏరియాల్లో ఓన్ రిలీజ్ చేసుకొన్నారు. ఇదంతా సినిమా హిట్ అవుతుందన్న గట్టి నమ్మకంతో.
కట్ చేస్తే.. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి అటు ఓవర్సీస్ లో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ ఊహించినంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. దాంతో రెండో రోజు నుంచే కలెక్షన్స్ తగ్గు ముఖం పట్టాయి. రివ్యూలు కూడా పెద్ద ఆశాజనకంగా లేకపోవడం, మౌత్ టాక్ కూడా సరిగా రాకపోవడంతో హాలీడే సీజన్ కూడా పెద్దగా ఉపయోగపడలేదు. ఆ కారణంగా క్రిష్ నిర్మాతగా ఇప్పుడు భారీ నష్టాలు చవిచూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటివరకూ కనీసం 15 కోట్ల గ్రాస్ కూడా వసూలు చేయలేదు. ఈ శుక్రవారం మళ్ళీ కొత్త సినిమాల హడావుడి మొదలుకానుంది. దాంతో దాదాపుగా 10 కోట్లకు పైనే క్రిష్ నష్టపోయే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరి తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ విజయాన్ని చూసుకొని ఈ నష్టాల బాధ నుంచి క్రిష్ బయటపడాలని కోరుకొందాం.