ఇటీవల కాలంలో రజనీ మేనియా తెలుగులో తగ్గుముఖం పట్టిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. రజనీ తెలుగు మార్కెట్‌ని పరిశీలిస్తే ‘భాషా’తో మొదలైన ఆయన ప్రభంజనం ‘అరుణాచలం, ముత్తు, నరసింహ, చంద్రముఖి, రోబో’ ఇలా అప్రతిహతంగా సాగుతోంది. కానీ ‘కొచ్చాడయాన్’ నుంచి పరిస్థితి మారింది. ‘విక్రమసింహా, లింగ, కబాలి, కాలా’ వంటి చిత్రాలు తెలుగు బయ్యర్లకు నష్టాలనే మిగిల్చాయి. ఇక ‘2.ఓ’ పరిస్థితి కూడా తెలుగులో పెద్ద ఆశాజనకం ఏమీ కాదు. దాంతో రజనీ చిత్రం అంటే కోట్లు పోసి తెలుగులో విడుదల చేసే పరిస్థితి మారింది. ఒకప్పుడు రజనీ చిత్రం వస్తోందంటూ స్టార్స్ తెలుగు చిత్రాలను కూడా రిలీజ్‌కి భయపడిన వారు ఇప్పుడు రజనీని పట్టించుకోవడం లేదు. ఆయన చిత్రాలకు తాజాగా థియేటర్ల సమస్య కూడా వచ్చిందంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్ధం అవుతుంది. ప్రస్తుతం రజనీ నటిస్తున్న పెట్టా చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ వంటి టాలెంటెడ్ డైరెక్టర్, సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నా కూడా ఈ మూవీ తెలుగురైట్స్ కేవలం 12 కోట్లకు అటు ఇటుగానే పలికాయట.
ఇక ఈ మూవీని మొదట సి.కళ్యాణ్ తీసుకున్నాడని వార్తలు వచ్చినా చివరకు అది నిజం కాదని తేలింది. ఈమూవీ రైట్స్‌ని వల్లభనేని అశోక్ తీసుకున్నాడు. ఈ చిత్రం తమిళంలో జనవరి 10న రిలీజ్ డేట్‌ని ఖరారు చేసుకుంది. ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. కానీ తెలుగులో అప్‌డేట్స్ గానీ, పోస్టర్స్ గానీ కనిపించడం లేదు. దాంతో ఈ మూవీ ముందుగా తమిళంలో విడుదలై, తెలుగులో ఆలస్యంగా రిలీజ్ అవుతుందనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ వల్లభనేని అశోక్ మాత్రం డబ్బింగ్ పనులు మొదలుపెట్టేశాడు. కానీ ప్రమోషన్స్ జీరో. రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాతే ప్రమోషన్స్ మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. ఇక సంక్రాంతికి డబ్బింగ్ చిత్రాలు విడుదల చేయరాదనే ఓ నిబంధన నాడు మన నిర్మాతలు పెట్టుకున్నారు. సంక్రాంతికి ‘కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్ 2’ చిత్రాలు బరిలో ఉండటం, అందరు పెద్ద వారే కావడంతో వారు రజనీ ‘పెట్టా’కి అభ్యంతరం చెబుతున్నారు.
కానీ పెద్ద పోటీ మధ్య కూడా సంక్రాంతికి సూర్య నటించిన ‘గ్యాంగ్’ చిత్రం విడుదలైంది. దీని వెనుక అల్లుఅరవింద్, యూవీ క్రియేషన్స్ వంటి పెద్దలు ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. మరి ‘గ్యాంగ్’కి లేని అభ్యంతరం ‘పెట్టా’కి ఎందుకు అనేది అసలు వాదన. వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు... రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా వంటి ఎన్నో ఉపమానాలు దీనికి వర్తిస్తాయి. మన నిర్మాతలే ఇదే పట్టుదలతో ఉంటే రాబోయే రోజుల్లో తెలుగు హీరోలు చేసే బహుభాషా చిత్రాల విషయంలో తమిళ నిర్మాతలు కూడా దీనినే అనుసరిస్తారేమో మరి..!