ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిషన్ దేశంలో కొత్తగా ఏర్పాటయిన 29 పార్టీలకు ఎన్నికల గుర్తులను కేటాయించింది. ఇందులో భాగంగా పవన్ జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించిన సంగతి విదితమే. సాధారణంగా ఎన్నికల కమీషన్ ఏ రాజకీయ పార్టీనైనా చాయిస్‌గా ఉండేలా మూడు గుర్తులను సూచించమని చెబుతుంది. ఇక గాజు గ్లాస్ కాకుండా ఎన్నికల కమీషన్‌కి జనసేన కోరిన మిగిలిన రెండు గుర్తులు ఏమిటి? అనే విషయంలో ఇప్పటికే పలు ఊహాగానాలు వచ్చాయి. ఎట్టకేలకు వీటికి తెరపడింది. జనసేన ఎన్నికల సంఘాన్ని కోరిన గుర్తులలో మొదటిది పిడికిలి గుర్తు. ఇదైతే జనసేన పార్టీకి ఖచ్చితంగా సూట్ అయ్యేదనే చెప్పాలి. ఎందుకంటే పవన్ తన ప్రసంగాలలో, ఇతర సందర్భాలలో ప్రజలకు అభివాదంగా పిడికిలిని చూపిస్తూ ఉంటారు. ఇక రెండో చాయిస్‌ని గాజు గ్లాస్‌కి ఇచ్చారు. మూడో ఆప్షన్‌గా బక్కెట్‌ని సూచించారు. వీటిలో రెండో దానికి కేంద్ర ఎన్నికల కమిషన్ పచ్చజెండా ఊపింది. మరోవైపు ప్రతి ఒక్క వ్యక్తికి జాతి, మతం, కులం, ప్రాంతాల భేదాలు లేకుండా గాజు గ్లాస్‌తో ఎంతో అవినాభావ సంబంధం ఉన్నందువల్ల ఈ గుర్తు తొందరగానే ప్రజల మదిలోకి చేరుతుందని జనసేన వర్గాలు అంటున్నాయి.
మరోవైపు కాస్టింగ్‌కౌచ్ విషయంలో సంచలనాలు సృష్టించి, పవన్‌ని బూతు పదంతో తిట్టడంతో సీన్‌రివర్స్ అయిన నటి శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైకి మకాం మార్చింది. ఆమెకు తమిళంలో ఓ ఆఫర్ కూడా వచ్చిందని వార్తలు వచ్చాయి. మకాం మార్చినా కూడా ఈమె పవన్‌ని టార్గెట్ చేయడం మాత్రం మానలేదు. ఆమె పవన్ ఎన్నికల గుర్తుపై స్పందిస్తూ, ఇంతకీ ఆ గాజు గ్లాస్ బీర్‌గ్లాసా? వైన్ గ్లాసా? లేక స్కాచ్ గ్లాసా? అంటూ వ్యంగ్యోక్తులు విసరడంతో జనసైనికులు, మెగాభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. మరోవైపు జనసేన పార్టీకి మెగాబ్రదర్ నాగబాబు రూ.25లక్షలు, మెగాప్రిన్స్, నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌లు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ప్రస్తుతం యూరప్ టూర్‌లో ఉన్న పవన్ ఈ విషయంపై స్పందిస్తూ ఇది క్రిస్మస్‌కి తనకి లభించిన సర్‌ప్రైజ్‌గా పేర్కొన్నాడు. తాను ఇండియా వచ్చిన వెంటనే వారిని కలిసి కృతజ్ఞతలు తెలుపుతానని వ్యాఖ్యానించాడు.
మరోవైపు పవన్ విదేశాలకు విరాళాల కోసమే వెళ్తున్నాడన్న విషయం తెలిసిందే. ఇక తాను ‘ఆరెంజ్’ చిత్రం డిజాస్టర్ అయిన సందర్భంలో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్న సమయంలో తనకు అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్‌లు సాయం చేశారని పలుమార్లు చెప్పిన నాగబాబు ఇలా జనసేన పార్టీకి విరాళం ఇవ్వడం ద్వారా తమ్ముడి రుణం తీర్చుకున్నాడనే చెప్పాలి. బహుశా ఆయన ఇంత మొత్తం విరాళంగా ఇచ్చాడంటే తన కుమారుడి పుణ్యమా అని ఆర్ధికంగా కూడా కాస్త నిలదొక్కుకున్నట్లే కనిపిస్తోంది.
పవన్ జనసేన పార్టీని స్థాపించిన మొదట్లో అన్నయ్య చిరంజీవి మాత్రం కాంగ్రెస్‌లోనే ఉన్నాడు. ఈ సమయంలో నాగబాబు, పవన్‌కి కాకుండా అన్నయ్య ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాడు. అన్నయ్య కాంగ్రెస్‌లో ఉన్నందువల్ల మెగాభిమానులందరు అన్నయ్యకే మద్దతు తెలపాలని స్టేట్‌మెంట్స్ కూడా ఇచ్చాడు. కానీ చిరు రాజకీయాలకు దూరం అయిన నేపధ్యంలో నాగబాబు స్వరంలో మార్పు బాగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఏదో ఒక స్థానం నుంచి జనసేన తరపున ఎంపీగా పోటీ చేయవచ్చనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.