పాతతరం నటీనటుల్లో సంపాదించిన సొమ్మును జాగ్రత్తగా పెట్టుబడి పెట్టకుండా, తమ వద్ద కూడా జాగ్రత్త చేసుకోకుండా చివరి రోజుల్లో కోట్లు సంపాదించిన వారు కూడా దారుణమైన పరిస్థితులను చవిచూశారు. ఉన్నంతలో ఎన్టీఆర్, ఏయన్నార్‌లు కాస్త మేలు. ఇక శోభన్‌బాబు, మురళీమోహన్‌లు అయితే భూములపై పెట్టుబడి పెట్టి అపరకుబేరులయ్యారు. కానీ సూపర్‌స్టార్ కృష్ణ విషయానికి వస్తే మాత్రం ఆయన పెద్దగా డబ్బుల విషయంలో జాగ్రత్త పడలేదనే చెప్పాలి. దానాలు ధర్మాలు, సొంత నిర్మాణం, పెద్దకుమారుడిని హీరోగా నిలబెట్టే ప్రయత్నం, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ముందు వెనుక చూడకుండా లెక్కలేనంత సాయం, పోటీ కోసం సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడం, తన వల్ల నష్టపోయిన నిర్మాతలను పలు విధాలుగా ఆదుకోవడం వంటి అనేక కారణాలు దీనికి ఉన్నాయి.
ఇక ఈయన పద్మాలయ స్టూడియోస్ కూడా అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోస్‌తో పోల్చుకుంటే పెద్దగా ఎదగలేదు. ఇంతలో పద్మాలయ టెలిఫిల్మ్స్ స్థాపించి బాగా అప్పుల పాలయ్యాడు. ఇక ఈయన పెద్దకుమారుడు రమేష్‌బాబు కూడా హీరోగా, నిర్మాతగా రాణించింది తక్కువే. ఆయన పోగొట్టుకున్నదే ఎక్కువ. దాంతో వారి నుంచి మహేష్‌బాబు మంచి గుణపాఠమే నేర్చుకున్నాడని చెప్పాలి. ఒకవైపు సాయాలు, గ్రామాల దత్తత, రెయిన్‌బో హాస్పిటల్స్ వంటి వాటికి సాయం చేస్తూనే మరోవైపు పలు రకాలుగా సంపాదన మొదలుపెట్టాడు. తన భార్య నమ్రతా నుంచి వచ్చిన కోట్లాది రూపాయల ఆస్థిపాస్థులతో పాటు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా రెండు చేతులా సంపాదిస్తున్నాడు. పవన్ సినిమాలకు దూరం అయిన నేపధ్యంలో హీరోగా ఈయన మరింత బిజీ కావడమే కాదు.. మరింతగా పారితోషికం పెంచాడని వార్తలు వస్తున్నాయి.
ఇక తమ ఇంట్లోనే పద్మాలయా స్టూడియోస్, కృష్ణ పేరుపై ఓ బేనర్, తల్లి ఇందిరాదేవి పేరుతో ఓ ప్రొడక్షన్ సంస్థ ఉన్నా కూడా తన సొంతంగా ఎంబీ అనే సంస్థను స్థాపించి ‘శ్రీ మంతుడు, బ్రహ్మోత్సవం’ వంటి చిత్రాలను భాగస్వామ్యంలో నిర్మించాడు. ‘బ్రహ్మోత్సవం’ ఇచ్చిన షాక్‌తో ప్రస్తుతం రిస్క్ తీసుకోకుండా బయటి బేనర్లలోనే చిత్రాలు చేస్తున్నాడు. ఇక ఇటీవల ఆయన చైన్ థియేటర్ బిజినెస్‌ని మొదలుపెట్టాడు. ఇక తాజాగా ఆయన డిజిటల్ ఫ్లాట్‌ఫారంపై దృష్టి సారించాడు. ఇందుకోసం ఓ డిజిటల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాడట. త్వరలో దీనికోసం ఓ వెబ్‌సిరీస్‌ని నిర్మించనున్నాడు. హుస్సేన్ అనే దర్శకునితో దీనికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ వచ్చే ఏడాది సంక్రాంతి పూర్తయిన తర్వాత ప్రారంభం కానుందని సమాచారం.