విజయ్ అంటే కోలీవుడ్ టాప్‌స్టారో.. లేక టాలీవుడ్ విజయ్‌దేవరకొండనో కాదు.. తమిళంలో విభిన్న ప్రయోగాలు చేస్తూ కమల్‌హాసన్, విక్రమ్, సూర్యల తర్వాత తనదైన శైలిలో నటించుకుపోతున్న యంగ్‌స్టార్ విజయ్‌సేతుపతి. ఈ ఏడాది ఆయన మణిరత్నం దర్శకత్వంలో నటించిన ‘నవాబ్’ చిత్రంలోని ఆయన పాత్రకి ఎంతో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ పాత్రను ఆయన పోషించిన తీరు అందరినీ మంత్రముగ్దులని చేసింది. సినిమా కంటెంట్ గాడ్‌ఫాదర్‌కి స్ఫూర్తే అయినా ఇందులో విజయ్‌సేతుపతి, ఇతర నటీనటుల నటనాస్థాయి వల్ల ఈమూవీ భారీ వసూళ్లు సాధించి, మణిరత్నంకి ఓకే అనిపించింది. ఇక ఆ తర్వాత ఆయన త్రిషతో కలిసి నటించిన మరో విభిన్న చిత్రం ‘96’ ఆయన కెరీర్‌లోనే అత్యంత విభిన్నచిత్రంగా, కమర్షియల్‌గా కూడా ఎంతో విజయం సాధించిపెట్టింది. అయితే ఈయన తన నిర్మాణ భాగస్వామ్యంలో ఓ చిత్రం నిర్మించడం, అది డిజాస్టర్ కావడంతో భారీగా ఆర్ధిక నష్టం చవిచూశాడు.
ఇక క్రిస్మస్ కానుకగా వరుసగా వచ్చిన సెలవులను ఉపయోగించుకుంటూ తమిళంలో ఏకంగా తొమ్మిది చిత్రాలు విడుదల అయ్యాయి. ఇందులో ధనుష్ నటించిన ‘మారి 2’ కూడా ఉంది. ధనుష్ గెటప్, నటన ఆకట్టుకున్నప్పటికీ పాతచింతకాయ వంటి కంటెంట్ వల్ల ఈ చిత్రం కోలీవుడ్‌లో జస్ట్ యావరేజ్‌గా నిలిచింది. ఇక ఇది తెలుగులోకి డబ్ అయినా, అసలు విడుదలైందో లేదో కూడా ఎవ్వరికీ తెలియదనే చెప్పాలి.
ఇక విషయానికి వస్తే క్రిస్మస్ కానుకగా కోలీవుడ్‌లో విడుదలైన తొమ్మిది చిత్రాలలో బ్లాక్‌బస్టర్ టాక్‌ని మాత్రం విజయ్‌సేతుపతి చిత్రమే సాధించింది. ‘భారతీయుడు’లో పెద్ద కమల్‌హాసన్ పోషించిన ముసలి పాత్ర అయిన ‘సేనాపతి’ తరహాలో విజయ్ సేతుపతి తాజాగా ‘సీమకత్తి’ చిత్రం చేశాడు. ఇందులో 70ఏళ్ల వృద్దుడిగా, ఎంతో క్రేజ్ ఉండగానే సినిమాల నుంచి చెప్పాపెట్టకుండా సినిమాలను షూటింగ్ మధ్యలో వదిలేసే అయ్యా అనే స్టార్ పాత్రలో విజయ్ జీవించాడనే చెప్పాలి. ఈ మూవీ కమర్షియల్‌గా సంచలనాలకు రెడీ అవ్వడమే కాదు.. నటునిగా విజయ్‌సేతుపతిని ఏకంగా పదిమెట్లు పైకి ఎక్కించిందనే చెప్పాలి. మరి ఈ చిత్రం తెలుగులోకి డబ్ అవుతుందో లేదో వేచిచూడాల్సివుంది. ఎందుకంటే ప్రస్తుతం విజయ్‌సేతుపతి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా..నరసింహారెడ్డి’ చిత్రంలో కీలకపాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం కంటే ముందే విజయ్‌కి తెలుగులో మంచి గుర్తింపు రావాలంటే ఇలాంటి చిత్రాలను తెలుగులో డబ్బింగ్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్పాలి.