స్టార్ హీరో నుంచి లైట్ బోయ్ వరకూ సినిమాల్లోకి వచ్చేది పేరు కోసమే. ఒక్కోసారి పనిచేసిన సినిమాకి డబ్బులు రాకపోయినా.. టైటిల్ కార్డ్స్ లో తమ పేరు చూసుకొని మురిసిపోతుంటారు నటీనటులు మరియు టెక్నీషియన్స్. అలాంటిది యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాత్రం తనకు డైరెక్టర్ క్రెడిట్స్ వద్దు అంటుండడం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ హిట్ మూవీ క్వీన్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న దటీజ్ మహాలక్ష్మి చిత్రానికి ముందు నీలకంఠ దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. కానీ.. అనంతరం కథానాయకి తమన్నాతో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా నీలకంఠ తెలుగు వెర్షన్ నుంచి తప్పించుకొని మలయాళం వెర్షన్ కు షిఫ్ట్ అయ్యారు. అప్పటికే అ సినిమాతో డీసెంట్ హిట్ అందుకొన్న ప్రశాంత్ ను తెలుగు వెర్షన్ ను కంప్లీట్ చేయమని బాధ్యతలు అప్పగించారు. ప్రశాంత్ వెంటనే ఒప్పుకొని రంగంలోకి దిగాడు.
కానీ.. కొన్నాళ్ళ క్రితం విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లోనూ, మొన్న విడుదలైన టీజర్ లో కూడా డైరెక్టర్ టైటిల్ కార్డ్ మిస్ అయ్యింది. ప్రొజెక్ట్ ను కంప్లీట్ చేసి కూడా డైరెక్టర్ క్రెడిట్ ప్రశాంత్ ఎందుకు తీసుకోవడం లేదు అనేది చర్చనీయాంశంగా మారింది. నీలకంఠకు రెస్పెక్ట్ ఇచ్చి ప్రశాంత్ ఆ పని చేయడం లేదని కొందరు చెబుతుంటే.. ఇంకొందరు మాత్రం అవుట్ పుట్ సరిగా రాలేదని.. ఈ సినిమాకి క్రెడిట్స్ తాను తీసుకొంటే.. ఆ రిజల్ట్ క్రెడిట్స్ కూడా తన ఖాతాలో చేరుతాయి కాబట్టి ప్రశాంత్ ఇలా ముందుచూపుతో వ్యవహరిస్తున్నాడని విశ్లేషిస్తున్నారు.
అది కూడా నిజమే.. మొన్న విడుదలైన అన్నీ భాషల టీజర్స్ తో తమిళం, మలయాళం మాత్రమే ఆకట్టుకోగలిగాయి. తెలుగు వెర్షన్ టీజర్ మీద విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అసలు తమన్నా సూట్ అవ్వలేదని, ఆ వాయిస్ అస్సలు సింక్ అవ్వలేదని చెప్పుకొచ్చారు.