అప్పట్లో దర్శకదిగ్గజం కె.వి.రెడ్డిగారు ఒక మాట చెప్పేవారట. సినిమాలో మనం తెర మీద ఎంత చూపిస్తున్నామో దానికి మాత్రమే ఖర్చు చేయాలని. ఎంతటి భారీ సినిమా తీసినా.. రాజమౌళి కూడా ఆ పద్ధతినే ఫాలో అవుతూ వచ్చాడు. కానీ.. మన దర్శక ఘనాపాటి బోయపాటి మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకొన్నట్లు లేడు. ఎందుకంటే.. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం వినయ విధేయ రామలోని ఓ పాట ఏకంగా 800 మంది డ్యాన్సర్స్ తో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట. సాధారణంగా ఈ తరహా ఇంట్రో సాంగ్స్ కోసం ఒక 50 నుంచి 100 దాకా జనాల్ని వాడుతుంటారు. కానీ.. బోయపాటి ఏకంగా 800 మంది డ్యాన్సర్స్ లో ఏం చేయాలనుకొంటున్నాడో ఎవరికీ అర్ధం కానీ విషయం. నిజానికి మనం చూసే వెండితెరపై ఒక 100 మంది కనిపిస్తేనే తెర నిండుగా కనిపిస్తుంటుంది. అలాంటిది 800 మంది అంటే 4 నిమిషాల పాటలో ఏం కనిపిస్తారు, ఎంతమంది కనిపిస్తారు చెప్పండి. ఇప్పటికే బడ్జెట్ చేతులు దాటిపోయిందని నిర్మాత దానయ్య కంగారుపడుతున్న తరుణంలో బోయపాటి ఇలాంటి భారీ ప్లానింగ్స్ చేయడం అవసరమా అని ఇండస్ట్రీ వర్గాలు ప్రశ్నిస్తున్నారు.
మరి బోయపాటి భారీతనం వెనుకున్న ప్లానింగ్ ఏమిటో తెలియదు కానీ.. దానయ్యకు మాత్రం దడ పుడుతోందట. మరి ఈ భారీ ఖర్చు మొత్తం కలెక్షన్స్ రూపంలో వెనక్కి వస్తే సరి.. లేదంటే మాత్రం భారీ నష్టాలు తప్పవు.