ఏ రాజకీయ పార్టీకైనా ప్రజల్లోకి దూసుకుని వెళ్లాలంటే ఎన్నికల గుర్తు చాలా ముఖ్యం. ఎన్నికల గుర్తు ఎంత బాగా ప్రజల్లోకి దూసుకెళ్లేలా ఉంటుందో అది ఎన్నికల్లో ఆ పార్టీకి అంత అదనపు ఉపయోగం అవుతుంది. అందుకే రాజకీయ పార్టీలు ఎన్నికల గుర్తు కేటాయింపులో ఎన్నో మల్లగుల్లాలు పడుతూ ఉంటాయి. గతంలో మనుషుల అవయవాలు, దేశ చిహ్నాలను కూడా ఎన్నికల సంఘం పార్టీలకు గుర్తుగా కేటాయించేది. చేయి, సైకిల్, కమలం వంటివి ఎన్నో దీనికి ఉదాహరణ. కానీ ఇటీవల కాలంలో ఎలక్షన్ కమిషన్ పార్టీల ఎన్నికల గుర్తింపు కేటాయింపులో కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. మనుషుల అవయవాలు, ఇతర జాతీయ పుష్పాలు, జంతువులు వంటి వాటిని గుర్తులుగా కేటాయించేందుకు నిరాకరిస్తోంది. దాంతో నేడు అంతా ఫ్యాన్, పిగిలి, గాలిపటం వంటి వాటిపైనే ఆధారపడుతున్నాయి.
ఇక విషయానికి వస్తే పవన్‌కళ్యాణ్ 2014 కంటే ముందే జనసేన పార్టీని స్థాపించినప్పటికీ ఇటీవల వరకు పార్టీ గుర్తు విషయంలో పెద్దగా శ్రద్ద చూపలేదు. దాంతో పలువురు ఆయన సానుభూతిపరులు కూడా ఆందోళనలో మునిగారు. ఎన్నికల గుర్తు ఎంత త్వరగా, ఎన్నికలకు ఎంత ముందుగా వస్తే దానిని ప్రజల్లోకి, ఓటర్లు, కార్యకర్తల మదిలోకి అంత త్వరగా తీసుకుని పోవచ్చు. కానీ మొదటి నుంచి పవన్‌కి తెలంగాణ ఎన్నికల్లో నిలబడే ఉద్దేశ్యమే లేదని, అందువల్లే ఆయన జనసేన పార్టీ ఎన్నికల చిహ్నం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని పలువురు విశ్లేషిస్తున్నారు. అయితే తాజాగా ఆయన రాబోయే ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఏపీ అంతా పోటీ చేస్తామని చెప్పాడు. దాంతో ఈసారి ఆయన ఎన్నికల గుర్తు కేటాయింపుపై బాగానే దృష్టి పెట్టాడు. తెలంగాణ ఎన్నికల్లో కూడా ప్రొఫెసర్ కోదండరాం స్థాపించిన టిజెఎస్‌కి ఎన్నికలకు అతి తక్కువ వ్యవధి ఉన్న సమయంలోనే ఎన్నికల గుర్తు కేటాయించడంతో దానిని ప్రజల్లోకి తీసుకుని పోవడానికి ఆయన చాలా కష్టపడ్డాడు. అయినా ఫలితం లేకుండా పోయింది.
ఇక విషయానికి వస్తే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో కొత్తగా ఏర్పడిన 29 పార్టీలకు ఎన్నికల గుర్తులను కేటాయించింది. ఇందులో భాగంగా జనసేనకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. ఒక ఏపీ అసెంబ్లీకి, లోక్‌సభ ఎన్నికలకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడం ఖాయమంటున్నారు. ఇలాంటి సందర్భంగా తన ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాస్‌కి పవన్ ఏభాష్యం చెబుతాడో? ఎంత త్వరగా ప్రజల్లోకి తీసుకుని వెళ్తాడో వేచిచూడాల్సివుంది...!