ఒక సినిమా మొత్తంలో ఎన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయ్ చెప్పండి. ఎంత బోయపాటి, వినాయక్ తీసినా కూడా ఓపెనింగ్, ఇంటర్వెల్ బ్లాక్ మరియు క్లైమాక్స్ లో.. ఇలా మొత్తం కలిపి ఒక మూడునాలుగు ఉంటాయి. కానీ.. శుక్రవారం విడుదలైన కె.జి.ఎఫ్ సినిమాలో లెక్కపెట్టాలే కానీ ఒక 25 ఎలివేషన్ సీన్స్ అయినా ఉంటాయి. ప్రతి సీన్ ఇంట్రడక్షన్ లా ఉంటుంది అని మనం సరదాగా అనుకోంటుంటాం కానీ.. దాన్ని నిజం చేసి చూపించాడు ప్రశాంత్ నీల్. తెలుగులో సరైన పబ్లిసిటీ మరియు పి.ఆర్ టీం లేకపోవడం వల్ల ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు చేరువవ్వడం లేదు కానీ.. కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని ఉంటే సినిమాకి రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వచ్చేవి.
సినిమాలో యష్ పెర్ఫార్మెన్స్ కి, ఫైట్ సీన్స్ కి మాస్ థియేటర్స్ లో జనాలు రచ్చ రచ్చ చేస్తున్నారు. కథలో ఉన్న దమ్ము కథనంలో కనిపించకపోవడాన్ని మాత్రమే మైనస్ గా ప్రేక్షకులు భావిస్తున్నారు. యష్ మ్యానరిజమ్స్, యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రం మామూలుగా లేవు. నిన్నటివరకూ మాస్ సినిమా అంటే ఒకలెక్క.. కె.జి.ఎఫ్ రిలీజ్ నుంచి మాస్ సినిమా అంటే మరో లెక్క అన్నట్లు ఉంది. ఈ సినిమా సెకండ్ చాప్టర్ కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుండడంతో.. కనీసం ఆ సినిమాకైనా సరిగా మార్కెటింగ్ ప్లాన్ చేసుకొంటే ఆల్రెడీ క్రియేట్ అయిన హైప్ కి కన్నడలో కంటే పెద్ద హిట్ సాధించడం అనేది పెద్ద కష్టమైన పనేమీ కాదు.
ఆల్రెడీ ఫస్ట్ డే పాజిటివ్ టాక్ పుణ్యమా అని థియేటర్లు పెరిగాయి. ఈ సినిమాతోపాటు విడుదలైన తెలుగు సినిమాలతోపాటు బాలీవుడ్ బిగ్ ఫిలిమ్ జీరో కూడా ప్రేక్షకుల్ని అలరించడంలో విఫలమవ్వడంతో కె.జి.ఎఫ్ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది.