ప్రస్తుతం నందమూరి కుటుంబంలో పూర్తిగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి మద్దతు ఇస్తోన్న ఒకే ఒక్కడు ఎన్టీఆర్ తనయుడైన నందమూరి బాలకృష్ణ. తెలుగుదేశం పార్టీకి ఆయన కొమ్ము కాయడమే కాదు... చంద్రబాబుకి వియ్యంకునిగా మారి, తన కుమార్తె బ్రాహ్మణిని బాబు కుమారుడు, ఏపీ మంత్రి నారాలోకేష్‌ని అల్లుడిని చేసుకున్నాడు. ఇక వాస్తవానికి ఎన్టీఆర్ మరణించిన సమయంలో నందమూరి కుటుంబంలోని అందరు, చివరకు హరికృష్ణ, దగ్గుబాటి పురందరేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి అందరి మద్దతు బాబుకి లభించింది. కానీ కరివేపాకుకాడను వాడుకున్నట్లుగా వాడుకుని బాబు వారిని పట్టించుకోకపోవడంతో వారు ఆయనకు దూరం అయ్యారు. వీరిలో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు పాత్ర కూడా ఉంది.
ఇక ఇటీవల తాజాగా లక్ష్మీపార్వతి ఎమ్మెల్యే పదవి కోసం బాలయ్య బాబుకి దాసోహం అనడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు చంద్రబాబు తమని వాడుకుని వదిలేస్తాడని తెలిసే మౌనంగా ఉంటున్నారని వ్యాఖ్యానించింది. ఇక తాజాగా ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ వేడుకలో ఈ విషయాన్ని మరోసారి మోహన్‌బాబు లేవనెత్తి తేనెతుట్టిని కదిలించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ లైఫ్‌లో కొందరు చెడ్డవారు కూడా ఉన్నారు. వారిని ఈ చిత్రంలో క్రిష్ చూపించాడో లేదో తెలియదు అని అంటూనే చెడ్డవారిని కూడా క్రిష్ మంచివారిగా చూపించాడేమో అనే ధర్మసందేహాన్ని వెలిబుచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ నాతో కొన్ని విషయాలను పర్సనల్‌గా షేర్ చేసుకున్నాడు. వాటిని ఈ వేదికపై చెప్పలేను. ఒకే గర్భంలో జన్మించకపోయనా ఎన్టీఆర్, నేను అన్నదమ్ములమే. అన్నయ్యతో కలిసి రెండుసార్లు షిర్డీ వెళ్లాను. అప్పుడు ఏమి కోరుకున్నావు దేవుడిని? అని అన్నగారు నన్నడిగారు. మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాను అని చెప్పాను. మరి మీరేం కోరుకున్నారు? అని నేనడిగాను. అది నేను చెప్పను అన్నారని వ్యాఖ్యానించాడు. ఇక బాలయ్య, చంద్రబాబుకి ఆప్తుడు కనుక ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో చంద్రబాబుని విలన్‌గా, వెన్నుపోటు వంటివి చూపించే అవకాశం లేదని ఎప్పటినుంచో ఎందరో భావిస్తున్నారు. అసలు లక్ష్మీపార్వతి ప్రస్తావన ఉంటుందా? లేదా? అనేది కూడా అనుమానమే. ఇప్పుడు అదే అంశాన్ని మోహన్‌బాబు నర్మగర్భంగా లేవనెత్తాడు. మరి సినిమాలో అసలు ఏమి చూపించారో మూవీ విడుదలైతే గానీ క్లారిటీ రాదనే చెప్పాలి.