వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్‌గోపాల్‌వర్మ. వివాదాలతో నిత్యం సాహవాసం చేసే వర్మ వాటిని అడ్డంపెట్టుకుని తన సినిమాలకు ఫ్రీ పబ్లిసిటీని ప్లాన్ చేసుకుంటాడన్నది జగమెరిగిన సత్యం. ఇక కోతికి అరటిపండు దొరికిన చందంగా వివాదమే అతని సినిమాకు కీలక కథావస్తువు అయితే వర్మను నిలువరించడం ఎవరి వల్లా కాదు. ఓ స్థాయిలో వికటాట్టహాసం చేయడూ.. అచ్చంగా వర్మ ప్రస్తుతం అదే చేస్తున్నాడు. `లక్ష్మీస్ ఎన్టీఆర్` పేరుతో వర్మ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో అంతకు మించి చేస్తూ టాలీవుడ్‌తో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చ చేస్తున్నాడు.
`ఎన్‌టిఆర్` బయోపిక్‌కు సంబంధించిన ఆడియో రిలీజ్ మరి కొద్ది నిమిషాల్లో జరగబోతున్న వేళ `లక్ష్మీస్ ఎన్టీఆర్` సినిమాకు సంబంధించిన `వెన్ను పోటు` పాటను విడుదల చేసిన వర్మ ఆ పాటతో ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేశాడు. సోషల్ మీడియాలో ఈ పాట ఓ రేంజ్‌లో హంగామా చేస్తోంది. విడుదలైన క్షణాల్లోనే లక్ష వ్యూస్ దాటడం సినిమా కోసం ఎంత ఈగర్‌గా జనం ఎదురుచూస్తున్నారో చెప్పకనే చెప్పింది. ఇదిలా వుంటే దీనికి ముందు వర్మ ఓ వీడియోను విడుదల చేశాడు. అందులో `ఒరేయ్ ఆర్జీవీ నా దగ్గర నేనున్నాను...విద్యాబాలన్ వుంది. రానా దగ్గుబాటి వున్నాడు అంటూ బాలకృష్ణ వాయిస్ ని మిమిక్రీ చేయించి తెలివిగా వర్మ ఓ టీజర్‌ను కట్ చేయించాడు. అదే వీడియోలో `సార్ నా దగ్గర నిజం వుంది. అంటూ కొత్త తరహా పబ్లిసిటీకి శ్రీకారం చుట్టిన తీరు అందరిని అవాక్కయ్యేలా చేస్తోంది.
`నా దగ్గర స్టార్స్ లేకపోవచ్చు అయితే నిజానికి సంబంధించిన సత్యం వుంది. సత్యాన్ని తలదన్నే యదార్థం వుంది. అది హైదరాబాద్ వైజ్రాయ్‌లోని సంఘటనలు అవ్వొచ్చు.. ఇంట్లోనూ..వంటింట్లోనూ జరిగిన కుటుంబ కుట్రలవ్వొచ్చు...అంటూ వర్మ వీడియోను వదలడంతో ఒక సినిమా కోసం పబ్లిసిటీని ఇలా కూడా చేసుకుంటరా? అని వర్మ స్ట్రాటజీకి కంగుతిన్న సగటు నిర్మాతలు నోరెల్లబెడుతూ వర్మా ఏంటీ మాకీ ఖర్మ అంటున్నారట.