మనదేశం పేరుకే లౌకిక దేశం గానీ ఇంత పెద్ద దేశంలో, అందునా మైనార్టీలను భుజానికి ఎత్తుకుని మోసి, ఓటు బ్యాంకుకోసం నానాతిప్పలు పడే ఇక్కడ మతసామరస్యం అనేది నేతి బీరకాయలో నెయ్యి చందమే. అందునా కాంగ్రెస్, బిజెపి, మజ్లిస్ వంటి పార్టీలు, నాయకులు ఉన్నంత కాలం ఈ దేశాన్ని ఎవ్వడూ కాపాడలేడు. అయితే అంత మాత్రాన కేవలం బిజెపి బలంగా ఉన్నందు వల్లే మతకల్లోలాలు, దాడులు జరుగుతున్నాయని భావించడానికి వీలు లేదు. మత ప్రాతిపదికగా పాకిస్థాన్ ఏర్పడిన తర్వాత, అందునా బంగ్లాదేశ్ పాకిస్థాన్ నుంచి విడిపోవడంలో భారత్ సాయం చేసిన తర్వాత మనం ఇంకా మత సామరస్యం గురించి మాట్లాడటం అనవసరం. ఇది ఒక్క మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఉన్నదే.
నల్లజాతీయులు, తెల్లజాతీయుల పేరుతో పాశ్చాత్యదేశాలలో కూడా ఇది మరోరూపంలో ఉంది. అంత మాత్రాన భారత్‌లోనే మత అసహనం పెట్రేగిపోతోందని వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదు. గతంలో అమీర్‌ఖాన్, షారుఖ్‌ఖాన్, కమల్‌హాసన్ వంటి సూడో మేధావులు ఇదే తరహా వ్యాఖ్యలు చేసి అగ్నికి ఆజ్యం పోశారు. ఇప్పుడు ఆ వంతు మరో దేశం గర్వించదగ్గ నటుడు నసీరుద్దీన్‌షాకి వచ్చింది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గోవు కళేబరం లభించడంతో హింసాత్మక చర్యలు జరిగాయి. ఈ హింసలో ఓ పోలీస్ అధికారి, మరో యువకుడు మరణించారు. దీనికి మత అసహనం, మత విద్వేషాల పేరుతో అందరూ, అన్ని ప్రాంతాలలో ఇదే పరిస్థితి ఉందన్నట్లుగా నసీరుద్దీన్‌షా చేసిన వ్యాఖ్యలు మాత్రం సరికావనే చెప్పాలి.
ఈయన తాజాగా మాట్లాడుతూ.. మనదేశంలో ఓ పోలీస్ అధికారి ప్రాణం కంటే గోవు ప్రాణం ఎక్కువైపోయిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇంకా ఈయన మాట్లాడుతూ, నా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే నాకు భయం వేస్తోంది. నా పిల్లలను ఏవైనా అల్లరి మూకలు చుట్టుముట్టి ‘మీ మతం ఏమిటి?’ అని అడిగితే నా పిల్లల వద్ద సమాధానం లేదు. ఎందుకంటే నా పిల్లలకు మతపరమైన విద్యావిదానాన్ని ఇవ్వాలని నేను కోరుకోలేదు. మంచైనా, చెడైనా అది మతం వల్ల ఎవ్వరికీ రాదు. పిల్లలకు ఏది మంచి? ఏది చెడు? అనేది మాత్రమే చెబుతాం. సమాజంలో ఇప్పటికే కావాల్సినంత విషాన్ని చొప్పించారు. ఇక దానిని వెనక్కి తీసుకోవడం జరిగే పని కాదు.
చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే వారిని శిక్షించే విషయంలో మన వద్ద ఎంతో వెసులు బాటు ఉంది. ఇది మన ఇల్లు. ఇక్కడి నుంచి మనల్ని వెళ్లిపోమని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదని వ్యాఖ్యానించాడు. నసీరుద్దీన్‌షా మాటల్లో వాస్తవమే ఉన్నా కూడా ఆయన దీనిని అందరికీ జనరలైజ్ చేయడం మాత్రం సరికాదు. ఇలాంటి వ్యాఖ్యలే ఎదుటి వారిని మరింతగా రెచ్చగొడతాయని, ఇలాంటి సమయంలో సంయమనం పాటించడమే ముఖ్యమని ప్రకాష్‌రాజ్, నసీరుద్దీన్‌షా వంటి వారు మర్చిపోతుండటం బాధాకరం.