కొందరు వార్తల్లో నిలిచే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రముఖుడి మీద నాలుగు సంచలన మాటలు మాట్లాడితేచాలు నేడున్న మీడియా పోకడలో చర్చలు, వాదోపవాదాలు, ప్రతి విమర్శలు, దానిపై విశ్లేషణలు.. ఇలా సాగుతుంది తంతు. ఈ విషయంలో అందరికంటే ఒక ఆకు ఎక్కువే చదివాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ. ఇటీవల ‘భైరవగీత’ సందర్భంగా ఏకంగా శంకర్‌నే వివాదంలోకి లాగిన ఘనత ఈయనది. ఇక ప్రస్తుతం వర్మ అటు నందమూరి అభిమానులకు, మరోవైపు మెగాభిమానులకు పిచ్చరేపుతున్నాడు. కయ్యానికి కారెవ్వరు అనర్హం అనే టైప్ వ్యక్తి వర్మ. పిల్లికి చెలగాటం.. ఎలుకకి ప్రాణ సంకటం.. ఊరి మొత్తం దారి ఒకటైతే.. ఉలిపి కట్టెది మరోదారి వంటి ఎన్నో ఉపమానాలు ఈయనకు వర్తిసాయి. గతంలో ఈయన చిరు, పవన్‌ల మీద కామెంట్స్ చేసినప్పుడు మెగాబ్రదర్ నాగబాబు రెచ్చిపోయి మరీ ‘అక్కుపక్షి’ అని ఏవేవో అని లేని ప్రచారాన్ని, పబ్లిసిటీని ఉచితంగా వర్మకి దక్కేట్టు చేశాడు.
ఇక తాజాగా వర్మ మరోసారి తన నైజం చాటుకున్నాడు. ఒకవైపు ఎన్టీఆర్ పక్కన నాదెండ్ల భాస్కర్‌రావు వెన్నుపోటు పొడిచే ముందు ఎలా నవ్వుతూ నిలబడ్డాడో, ఇప్పుడు పవన్ పక్కన నాదెండ్ల కుమారుడు మనోహర్ కూడా అలాగే ఉంటున్నాడని, ఈ విషయంలో ఆయన పవన్‌ని వెన్నుపోటు పొడవడం ఖాయమని వ్యాఖ్యలు చేశాడు. నిజానికి నాదెండ్ల భాస్కర్‌రావు విషయంలో వెన్నుపోటు దారునిగా ఆయనపై విమర్శలు ఉన్నా కూడా ఆయన కుమారుడు మనోహర్‌కి మాత్రం మంచి వ్యక్తిగా, హుందా కలిగిన నాయకునిగా మంచి పేరుంది. జనసేనలో ఇప్పటి వరకు చేరిన వారిలో అతి ముఖ్యుడు మనోహరే అని చెప్పాలి. కానీ వర్మకి మాత్రం మనోహర్ భవిష్యవాణి ప్రకారం కాబోయే వెన్నుపోటు దారునిగా కనిపించాడు.
మరోవైపు వర్మ ఎన్టీఆర్ బయోపిక్‌కి పోటీగా బాలయ్యపై విరుచుకుపడుతూ వీడియోలు రిలీజ్ చేశాడు. వెన్నుపోటు పాటని కూడా సరైన సమయంలో విడుదల చేస్తున్నాడు. మరి దీనికి బాలయ్య, వర్మకి ఘాటు సమాధానం చెప్పాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. కానీ బాలయ్య దీనిపై స్పందిస్తాడా? లేదా? అనేది చూడాలి. ఎందుకంటే బాలయ్య వర్మ మీద స్పందిస్తే మాత్రం అది వర్మకి కాబోయే కార్యం గంధర్వులు తీర్చినట్లుగా ఉచిత పబ్లిసిటీని ఇవ్వడమే అవుతుందనేది విశ్లేషకుల మాట. అసలే దుందుడుకు బాలయ్య ఏమి చేస్తాడో వేచిచూడాల్సివుంది...!