ఏ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ వి. రుద్ర దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తోన్న చిత్రం ‘ఇష్టంగా’. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ ఇది. స్టార్ కమెడియన్ ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. డిసెంబర్ 28న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశంను ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో నటుడు దువ్వాసి మోహన్ మాట్లాడుతూ..‘‘ప్రతి నిత్యం ఇష్టంగా ఎన్నో చేస్తుంటాం. ఆ ఇష్టాన్ని టైటిల్‌గా పెట్టుకున్నారు. సంపత్ వి. రుద్ర ఈ చిత్రానికి దర్శకుడవ్వడంతో అంచనాలు పెరిగాయి. ప్రియదర్శితో పాటు నటించాను. నవతరం నాయకానాయికలు చక్కగా నటించారు. ఈ సినిమాకి రచన, సంగీతం, సినిమాటోగ్రఫీ ప్రతిదీ బాగా కుదిరాయి. నిర్మాతలు అభిరుచితో సినిమా తీశారు. పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు.
నిర్మాత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘‘కొత్తవారిని ప్రోత్సహిస్తే మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమాని భారీగా రిలీజ్ చేస్తున్నాం. నటీనటుల ప్రదర్శన, సాంకేతిక నిపుణుల పనితనం తెరపై ఆకట్టుకుంటాయి. సహకరించిన అందరికీ ధన్యవాదాలు..’’ అన్నారు.
దర్శకుడు సంపత్.వి రుద్ర మాట్లాడుతూ.. ‘‘ఇది నా తొలి చిత్రం. 30రోజుల్లో పూర్తి చేయాలనుకున్న ఈ సినిమా కాన్వాసు మారి, బడ్జెట్ పెరిగింది. అందుకు తగ్గట్టే ప్రామిసింగ్ కంటెంట్, విజువల్స్‌తో సినిమా తెరకెక్కించాం. నిర్మాత రాజీ పడకుండా కావాల్సినవి సమకూర్చారు. గోవాలో 10 రోజుల పాటు సినిమాను చిత్రీకరించాం. అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాము. సినిమాటోగ్రఫీ, శ్రీనాధ్ డైలాగులు ఆకట్టుకుంటాయి. హీరో-హీరోయిన్ డెడికేషన్ మైమరిపిస్తుంది. పెద్ద విజయం అందుకుంటాం’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరో అర్జున్ మహి మాట్లాడుతూ.. ‘‘ఒక వెబ్‌సైట్‌లో పని చేసే కంటెంట్ రైటర్ హీరోని ప్రేమిస్తుంది. బాధ్యతలేని కుర్రాడితో ప్రేమలో పడినా.. ప్రేమ స్వచ్ఛమైనదని కథానాయిక పాత్ర నిరూపిస్తుంది. అమ్మాయి- అబ్బాయి సహజీవనం అంటే సెక్స్ లేదా ఇంకేదో ఊహించుకుంటారు. కానీ అంతకుమించి అని తెరపై చూస్తారు. వినోదంతో పాటు సందేశం ఆకట్టుకుంటుంది. అవకాశం కల్పించిన నా దర్శకనిర్మాతలకు, ప్రోత్సహించిన నాన్నగారికి ధన్యవాదాలు. ఈ సీజన్‌లో ఓ చక్కని రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌ని ప్రేక్షకులకు అందిస్తున్నాం. విజయం అందుకుంటాం’’ అన్నారు.
హీరోయిన్ తనిష్క్ మాట్లాడుతూ.. ‘‘ఇష్టంగా.. కథాబలం ఉన్న చిత్రం. నా పాత్రకు చాలా ప్రాదాన్యత ఉంది. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అన్నారు.