తెలుగులో నవతరం దర్శకులు తమదైన స్టైల్‌లో సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మహి.వి.రాఘవ కూడా చేరాడు. ఒకే ఒక్క చిత్రం అనుభవం ఉన్న ఆయన తన మొదటి చిత్రాన్ని హర్రర్ కామెడీగా రూపొందిస్తే రెండో చిత్రంతోనే వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ‘పాదయాత్ర’ మీద బయోపిక్‌గా వివాదాస్పదమైన ‘యాత్ర’ చిత్రాన్ని భుజానికి ఎత్తుకోవడం ఆశ్చర్యం కలిగించే పరిణామమనే చెప్పాలి. ఒకవైపు ఎన్టీఆర్‌పై ఆయన కుమారుడు బాలకృష్ణ తీస్తున్న బయోపిక్‌కి ఇప్పుడు వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో పాటు ‘యాత్ర’ కూడా బాగానే టెన్షన్ పెట్టే అవకాశాలు ఉన్నాయని ‘యాత్ర’ చిత్రం టీజర్‌ని చూస్తే అర్ధమవుతుంది.
ఇక ఇందులో తెలుగులో ‘స్వాతికిరణం, సూర్యపుత్రులు, రైల్వేకూలీ’ వంటి చిత్రాలలో నటించిన దేశం గర్వించదగ్గ నటుడు, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తుండటమే కాదు.. అచ్చు వైఎస్‌కి తగ్గ బాడీ లాంగ్వేజ్, హావభావాలు, లుక్స్, నటన, ఎమోషన్స్‌పరంగా అదరగొట్టాడనే చెప్పాలి. మమ్ముట్టి లేకపోతే అసలు ఈ చిత్రమే లేదా? వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్రను మమ్ముట్టి తప్ప మరెవ్వరు చేయలేరేమో అన్నంతగా ఆయన ఇందులో పరకాయ ప్రవేశం చేశాడు. కేవలం గెటప్, పోస్టర్స్ ద్వారానే విపరీతమైన స్పందన పొందిన ఈ చిత్రం టీజర్ ఈ మూవీని మరో పది మెట్లు పైకి తీసుకుని వెళ్లిందనే చెప్పాలి. ‘నీళ్లుంటే కరెంట్ ఉండదు. కరెంట్ ఉంటే నీళ్లు ఉండవు. రెండు ఉండి పంట చేతికొస్తే సరైన గిట్టుబాటు ధర ఉండదు. అందరూ రైతే రాజు అంటారు. మమ్మల్ని రాజులుగా కాదు.. రైతులుగా బతకనివ్వండి చాలు.. అంటూ ఆవేదనతో సాగే రైతు చెప్పే డైలాగ్స్‌కి, వైఎస్ పాత్రలో ఉన్న మమ్ముట్టి ‘నేను విన్నాను.. నేనున్నాను’ అని ఎమోషనల్‌గా చెప్పే ధైర్యం అద్భుతంగా ఉన్నాయి.
యాత్రకు సమరశంఖం పూరించి ప్రారంభించిన సన్నివేశాలను, ఒక కాలికి కట్టుతోనే వైఎస్ పాదయాత్రను ప్రారంభించిన విషయాలను వాస్తవానికి దగ్గరగా చూపించడంలో దర్శకుడు వందశాతం సక్సెస్ అయ్యాడు. పొలంలో రైతు ఆత్మహత్య, జొన్న చేలోకి వైఎస్‌గా మమ్ముట్టి ఎంట్రీ ఇచ్చిన విధానం, పొలంలో ఎండిన చెట్టుకు ఉరిపోసుకున్న రైతు సీన్స్‌ని కట్ చేసిన విధానం అద్భుతమనే చెప్పాలి. మొత్తానికి ఈ ‘యాత్ర’ టీజర్ సంచలనాలకు మహి.వి.రాఘవ, మమ్ముట్టిలు సిద్దమయ్యారా? అనే నిశ్చితాభిప్రాయం మాత్రం వైఎస్ వ్యతిరేకుల్లో కూడా కలగడం గ్యారంటీ అని చెప్పాలి.