ఈవీవీ బ్రతికున్నప్పుడు ఆయన కొడుకులు రాజేష్, నరేష్ చేతినిండా సినిమాలతో కళకళలాడేవారు. అల్లరి నరేష్ కామెడీ హీరోగా మారితే.. ఆర్యన్ రాజేష్ మాత్రం ప్రేమ కథా చిత్రాలతో ఆకట్టుకున్నాడు. కానీ ఆర్యన్ రాజేష్ హీరోగా ఎక్కువ కాలం నిలబడలేకపోయాడు. ఈవీవీ బ్రతికుంటే.. కొడుకులని హీరాగానే పెట్టి ఏదో ఒక సినిమా చేస్తుండేవాడు. కానీ ఆయన మరణంతో ఆర్యన్ రాజేష్ మెల్లిగా సినిమాలకు దూరమయ్యాడు. ఇక అల్లరి నరేష్ కామెడీ కూడా వర్కౌట్ అవడం లేదు. వరస ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు. తాజాగా ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ లుగా మారిపోయారు.
ఆర్యన్ రాజేష్, రామ్ చరణ్ మూవీ వినయ విధేయ రామ లో చరణ్ కి అన్నగా నటిస్తున్నాడు. బోయపాటి.. ఆర్యన్ రాజేష్ కి రామ్ చరణ్ మూవీలో అన్నగా మంచి పాత్ర ఇచ్చాడు. ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఉన్న రామ్ చరణ్ వినయ విధేయ రామ వచ్చే సంక్రాంతికి విడుదలవుతుంది. ఈ సినిమా హిట్ అయ్యి రాజేష్ పాత్ర అందరికి కనెక్ట్ అయితే... మళ్ళీ ఆర్యన్ రాజేష్ సినిమాలతో బిజీ అవుతాడు. ఇక అల్లరి నరేష్ హీరోగా సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ మహేష్ మహర్షి సినిమాలో మహేష్ బాబుకి ఫ్రెండ్ గా సినిమాకి చాలా కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో అల్లరి నరేష్ రవి అనే పాత్రలో కనిపించనున్నాడు. మహేష్ బాబుకి ప్రాణ స్నేహితుడిగా కనిపించబోతున్నాడు. ఇక వంశి పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈమూవీ ఏప్రిల్ 5 న ఉగాది కానుకగా విడుదలవుతుంది. మరి మహేష్ మహర్షి హిట్ అయితే అల్లరి నరేష్ మరికొంతమంది స్టార్ హీరోల సినిమాల్లో ఏ స్నేహితుడుగానో, తమ్ముడిగానో మారిపోతాడు. ఒకవేళ ఆ సినిమా తేడా కొడితే మళ్ళీ హీరోగానే ట్రై చేసుకుంటాడు. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఈ అన్నదమ్ములను ఏ తీరానికి చేరుస్తారో చూడాలి.