గతంలో భార్యలు లేని సమయంలో భర్తల తీరు ఎలా ఉంటుందో పలు చిత్రాలలో చూపించి ప్రేక్షకులను బాగా నవ్వించారు. ఇది నిజమైన ఎంటర్‌టైన్‌మెంట్ దర్శకులకి ఎవర్‌గ్రీన్ హిట్ పాయింట్ అనే చెప్పాలి. ‘శ్రీరామచంద్రులు, పెళ్లాం ఊరెళితే, తేనెటీగ’ ఇలా ఎన్నో చిత్రాలు ఇదే కోవలోకి వచ్చి హిట్ అయ్యాయి. ఇక జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ వంటి వారి తర్వాత ప్రస్తుత తరం దర్శకుల్లో ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్‌ని నమ్ముకుని హిట్స్ కొడుతున్న దర్శకుడు అనిల్‌రావిపూడి. ఈయన తీసిన ‘పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్’ వంటి చిత్రాలన్నీ కామెడీనే నమ్ముకుని వచ్చి లాభాల పంట పండించాయి. అలాంటి అనిల్ రావిపూడి ప్రస్తుతం భార్యలు పక్కన లేని తోడల్లుళ్లు బాగా ఎంజాయ్ చేయాలని భావించి, చిందులేసే కాన్సెప్ట్‌తోనే ‘ఎఫ్2’ ( ఫన్ అండ్ ఫ్రస్టేషన్) చిత్రం రూపొందుతోంది.
ఇక దీనికి దిల్‌రాజు నిర్మాత కావడంతో దీనిపై అంచనాలు బాగా ఉన్నాయి. ‘గురు’ తర్వాత ఎంతో గ్యాప్ తీసుకుని సీనియర్ స్టార్ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌లు నటిస్తున్న ఈ మూవీలోని ఫస్ట్‌సింగిల్ వీడియో విడుదలైంది. దాదాపు రెండు నిమిషాల పాటు ఉన్న ఈ సాంగ్‌కి దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం, దానికి కాకర్ల శ్యామ్ ఇచ్చిన ఫన్నీ సాహిత్యంతో పాటు మాస్‌కి లుంగీ ఎగ్గట్టి చిందులు వేసే వెంకీ, వరుణ్‌లు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. క్రికెట్ బాల్‌కి రెస్ట్ దొరికితే.. జాతీయ సెలవులన్నీ ఒకే రోజున వస్తే.. వంటి క్యాచీ పదాలతో శ్యామ్ దీనికి మంచి ఎంజాయ్ మెంట్‌ని అందిస్తూ సాహిత్యం ఇచ్చాడు.
సో.. ఈ మూవీ కూడా భార్యలు పక్కనలేనప్పుడు ఒకరి విషయంలో ఫన్, మరొకరి విషయంలో ఫస్ట్రేషన్ అనే విధంగా సాగడంతో ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్ అదేనని అర్ధమవుతోంది. ఇక ఇలాంటి పాత్రలను పోషించడం పాటలో కనిపించిన వరుణ్‌తేజ్‌కి కొత్తేమో గానీ వెంకీకి, మద్యలో చిందులేసిన రాజేంద్రునికి బాగా కొట్టిన పిండే. మరి సంక్రాంతికి ‘కథానాయకుడు, వినయ విధేయ రామ’లకు పోటీగా వస్తున్న ఈ సైలెంట్ కిల్లర్ ఫ్యామిలీ, యూత్‌ని ఎంటర్‌టైన్‌మెంట్‌తో అలరిస్తే మిగిలిన రెండు చిత్రాలకు భారీ పోటీ తప్పదనే చెప్పాలి.