నాటితరంలో సినిమాలలో నటించే నటీనటులు ఎంతో అనుభవం, ఎన్నో చిత్రాల ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే నిర్మాణరంగంలోకి, ఇండస్ట్రీలోని ఇతర రంగాలలోకి ఎంట్రీ ఇచ్చేవారు. అయినా వారిలో కూడా సక్సెస్ సాధించిన వారు అరుదనే చెప్పాలి. కానీ నేటి పరిస్థితి అలా లేదు. ఒకటి రెండు హిట్స్ వచ్చిన వెంటనే హీరోలు సైతం నిర్మాతలుగా అవతారం ఎత్తుతున్నారు. ఈ విషయంలో సినీ బ్యాగ్రౌండ్ ఉండే వారు కాస్త బాగానే సక్సెస్ అవుతున్నా, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వారు మాత్రం నష్టాల పాలవుతున్నారు. విచిత్రంగా దర్శకులుగా ఎన్నో హిట్స్ ఇచ్చిన వారు కూడా నిర్మాణరంగంలో దెబ్బలు తింటున్నారు. ఉదాహరణకు రామ్‌చరణ్‌తో పాటు రానా, త్వరలో అల్లుఅర్జున్ వంటి వారు నిర్మాతలుగా ఓకే అనిపించే అవకాశాలు కనిపిస్తున్నా కూడా నారా రోహిత్, నాని, నాగశౌర్య వంటి హీరోలతో పాటు అనుభవం ఉన్న నితిన్, త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్‌కళ్యాణ్, సుకుమార్, హరీష్‌శంకర్ వంటి వారు పడిలేస్తున్నారు.
ఇక విషయానికి వస్తే తమిళంలో అతి తక్కువ కాలంలోనే వైవిధ్యభరితమైన చిత్రాలు చేసే నటునిగా పేరు తెచ్చుకున్న కోలీవుడ్ యంగ్ స్టార్ విజయ్‌సేతుపతి. ఈయన ఇటీవల నటించిన మణిరత్నం చిత్రంలో మిగిలిన హీరోలతో పాటు విజయ్‌సేతుపతికి కూడా నటునిగా మంచి గుర్తింపును తెచ్చింది. ఇక త్రిషతో ఆయన నటించిన విభిన్న టైటిల్‌తో కూడిన వైవిధ్యభరిత చిత్రం ‘96’ పెద్ద బ్రేక్‌నిచ్చింది. ఈ చిత్రం రీమేక్ కోసం తెలుగు నిర్మాతలు, హీరోలు కూడా ఎదురుచూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇక వచ్చే ఏడాది ఆయన మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కానున్నాడు.
కానీ ఈయన అతి తక్కువ అనుభవంతో నిర్మాతల్లో ఒకరిగా మారి నిర్మించిన ‘జుంగా’ చిత్రం పెద్ద షాక్‌నిచ్చింది. జూలైలో విడుదలైన ఈ మూవీ ద్వారా నిర్మాతగా విజయ్‌సేతుపతికి 11కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి విజయ్ సేతుపతి వంటి హీరోకి ఈ మొత్తం చాలా పెద్దదే. ఈ నష్టాలను పూడ్చడానికి ఆయన తాను తదుపరి చేసిన మూడు చిత్రాల రెమ్యూనరేషన్స్‌ని అప్పులు తీర్చేందుకు వినియోగించాడనే వార్తలు కోలీవుడ్‌లో బాగా హల్‌చల్ చేస్తున్నాయి. అందుకే మన పెద్ద వారు చెప్పినట్లు తొందరపడి చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి లాభం? అనేది ఇప్పటికైనా యువ హీరోలు గమనిస్తే మంచిదని చెప్పాలి.