కమెడియన్లు హీరోలుగా మారి ఆ తర్వాత మరలా పాత వేషాలకే తిరిగి వస్తూ ఉండటం అనేది ఎంతో కాలంగా జరుగుతున్నదే. అయితే ఎంత కాలం, ఎన్ని సినిమాలకు హీరోగా చేశారు? అనే విషయాన్ని పక్కనపెడితే అసలు కమెడియన్లు తమ క్రేజ్, ఇమేజ్‌ల గురించి ఎక్కువగా ఊహించుకుని హీరోలుగా మారడం అనేది సరైన పద్దతి కాదని నాటి రాజబాబు, పద్మనాభం నుంచి బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబూమోహన్, అలీ, సునీల్, సప్తగిరి.. ఇలా ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది. అయినా ఇలా హీరోల పాత్రలపై ఆశపడే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇక తాజాగా తెలుగు కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ దీనిపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఏడేళ్లపాటు సునీల్ హీరోగా చేశాడు. ఆ తర్వాత మరలా కమెడియన్ అవతారం ఎత్తాడు. సునీల్ మరలా వస్తున్నాడు.. ఇరగదీస్తాడు.. దున్నేస్తాడు.. పొడిచేస్తాడని అందరు అనుకున్నారు.
కానీ ఆయన కమెడియన్‌గా కూడా మెప్పించలేకపోతున్నాడు. నాకు తెలిసి హీరోగా ఎక్కువకాలం కొనసాగిన కమెడియన్లను మరలా హాస్యనటులుగా అంగీకరించడం కష్టమే. ఇక ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో హవా నడుస్తుంది. అలా బ్రహ్మానందం, సునీల్‌లకి జరిగింది. ప్రస్తుతం నాలాంటి కమెడియన్లకు మంచి గిరాకి ఉంది. అయినా ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ వంటి హాస్యనటుల మరణం తర్వాత పూర్తిస్థాయి హాస్యచిత్రాలు తగ్గిపోయాయి. నిజానికి నా ఫిజక్ కమెడియన్‌గా సూట్ కాదు. కానీ నా మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ వంటివి ప్రేక్షకులకు హాస్యాన్ని అందిస్తున్నాయి. గతంలో ఏడాదికి 40 చిత్రాలు చేశాను. కానీ ఈ ఏడాది మాత్రం 20 సినిమాలలోనే నటించాను. మహేష్‌బాబు ‘మహర్షి’, రామ్‌చరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్రాలతో పాటు ‘బ్లఫ్ మాస్టర్’ నాకు మంచి పేరు తెస్తుంది. ‘ఖడ్గం, లౌక్యం’తరహాలో నాకు పేరు వస్తుంది అని చెప్పుకొచ్చాడు.
ఇక ఆయన రాజకీయాల గురించి మాట్లాడుతూ, వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ‘యాత్ర’ చిత్రంలో తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైయస్‌ని పొగిడే పాత్రను చేస్తున్నాను. నేను 2013 నుంచి వైఎస్‌కి వీరాభిమానిని. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు.‘యాత్ర’ చిత్రం వచ్చే ఎన్నికల ముందు రఫ్పాడించే చిత్రంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది. వచ్చే ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుంది. ఈసారి వైసీపీ తరపున స్టార్ క్యాంపెయిన్ జరగనుంది. అది చూస్తే మీకే ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పుకొచ్చాడు. అయినా పృథ్వీ కూడా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ వంటి చిత్రాలలో దాదాపు హీరో వంటిపాత్రలే చేశాడు. అంతేగానీ పృథ్వీకి రాజకీయాలలోకి వచ్చిన నటీనటులు ఎక్కువకాలం రాణించలేరనే విషయం తెలియకపోవడం ఆశ్చర్యకరం. సినిమా నటులు ఏ రాజకీయ పార్టీకి అనుకూలురుగా ఉండకుండా తటస్థంగా ఉంటేనే ఎక్కువకాలం రాణిస్తారు అనేది కూడా పృథ్వీ విస్మరించాడు. ఆయన సినిమాల సంఖ్య, అవకాశాలు తగ్గడానికి, ప్రేక్షకుల ఆదరణలో మార్పు కావడానికి ఆయన ఓ పార్టీ జెండా మోయడం కూడా ఒక కారణమేమో కాస్త ఆలోచిస్తే మంచిది....!