ఏ భాష వారికి ఆయా భాషకి చెందిన స్టార్స్‌పై మక్కువ, అభిమానం ఉండటం సహజం. తమ హీరోలు చేసిన పనినే పరభాషా స్టార్స్ చేస్తే మాత్రం వారిపై విమర్శలు ఎక్కుపెట్టడానికి మన విమర్శకులు రెడీగా ఉంటారు. ఇక విషయానికి వస్తే గతంలో ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ వంటి పలువురు స్టార్స్ తమ షష్టిపూర్తి వయసులో కూడా తమ మనవళ్లకంటే చిన్నవారైన హీరోయిన్లతో కలిసి నటిస్తే పండుగ చేసుకునే వారు. అంతెందుకు.. ప్రస్తుతం చిరంజీవి ఈ వయసులో కూడా తన ప్రతిష్టాత్మకమైన 150వ చిత్రం ‘ఖైదీనెంబర్150’లో తన ఫ్యామిలీ హీరోలతోనే చిందులేసిన.. అందునా తన కుమారుడికి జోడీగా నటించిన కాజల్‌తో కలిసి ‘అమ్మడు.. లెట్స్ కుమ్ముడు’ అని నాట్యం చేస్తే పరవశించిపోయారు. ఇక నందమూరి బాలకృష్ణ పరిస్థితి కూడా అదే. కానీ అదే పనిని తాజాగా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చేస్తుంటే మాత్రం ఆయా పరవశించి పోయిన వారే ఇప్పుడు తలైవాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఇక విషయానికి వస్తే రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో నటించిన ‘2.ఓ’ భారీగా విడుదలైంది. ఇక ప్రస్తుతం ఆయన కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో సన్‌పిక్చర్స్ బేనర్‌పై సిమ్రాన్, త్రిషలతో కలిసి ‘పెట్టా’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతికి తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయాలని భావించారు. కానీ తెలుగులో సంక్రాంతికి బాలకృష్ణ ‘కథానాయకుడు’, రామ్‌చరణ్ ‘వినయ విధేయ రామ’, వెంకటేష్-వరుణ్‌తేజ్‌ల ‘ఎఫ్2’ వంటి భారీ చిత్రాలు విడుదల కానుండటంతో థియేటర్ల సమస్య వల్ల మొదట తమిళంలో విడుదల చేసి, తర్వాత గ్యాప్ తీసుకుని తెలుగులో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ మూవీ అనంతరం రజనీ మరో సినిమాని లైన్‌లో పెట్టాడు.
తాజాగా విజయ్-కీర్తిసురేష్‌లతో ‘సర్కార్’ చిత్రం తీసిన తమిళ గ్రేట్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీ నటించనున్నాడు. ఈ మద్య రజనీ తన వయసుకి తగ్గ పాత్రలు, దానికి తగ్గ హీరోయిన్లతోనే జోడీ కడుతున్నాడు. కానీ మురుగదాస్ చిత్రంలో మాత్రం ఆయన సరసన ‘మహానటి’ కీర్తిసురేష్ ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. రజనీ వయసు 70కి చేరువలో ఉంటే కీర్తి వయసు కేవలం పాతిక దాటింది. రజనీ కూతుర్లు కూడా కీర్తి కంటే పదేళ్లకు పైగానే పెద్ద. దాంతో ఈ ముసలి వయసులో రజనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటని తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. మరి రజనీకి వర్తించిన సూత్రం చిరు, బాలయ్యలకు మాత్రం వర్తించదా? అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నేనని చెప్పాలి.