కొద్దిగా ఫామ్‌లో ఉన్న హీరోలు.. తాము నటించే సినిమాల దర్శకత్వంలో వేలు పెడతారనే ప్రచారం ఎప్పటినుండో వున్నదే. స్టార్ దర్శకులైతే... హీరోలు చూసి చూడనట్టుగా డైరెక్షన్‌లో వేలు పెట్టరు కానీ... కాస్త పేరున్న చిన్న చితక దర్శకులతో సినిమాలు చేస్తుంటే మాత్రం హీరోలు తమ హీరోయిజాన్ని అక్కడ కూడా చూపిస్తారు. ఇక గతంలో చాలామంది హీరోలు ఇలా దర్శకులను ఇబ్బందులు పెట్టారంటారు. తాజాగా గరుడ వేగ తో చాలా ఏళ్ళకి ఫామ్‌లోకి వచ్చిన రాజశేఖర్ కూడా ఇప్పుడు ఒక దర్శకుణ్ణి ఇబ్బంది పెడుతున్నాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్‌లో వినబడుతుంది.
గరుడవేగ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ ‘కల్కి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకి సంబంధించిన హాట్ న్యూస్ ఒకటి.. ఇప్పుడు ఫిలింసర్కిల్స్‌లో హాట్ హాట్ గా ప్రచారంలోకొచ్చింది. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పెండింగ్‌లో ఉన్న ఈ సినిమా షూటింగ్‌లో రాజశేఖర్‌కి, ప్రశాంత్ వర్మకి డైరెక్షన్ విషయంలో ఏవో విభేదాలొచ్చాయనే టాక్ నడుస్తుంది. ప్రశాంత్ దర్శకత్వాన్ని రాజశేఖర్ వేలెత్తి చూపడమే కాకుండా.... దర్శకత్వం విషయంలో రాజశేఖర్ ఎక్కువ జోక్యం చేసుకుంటూ.. ప్రశాంత్ వర్మని విసిగిస్తున్నాడనే టాక్ బాగా వినిపిస్తుంది.
రాజశేఖర్ కోపం కారణంగా కల్కి షూటింగ్ రెండుమూడు సార్లు వాయిదా కూడా పడిందని ప్రచారం జరుగుతుంటే... దర్శకుడు ప్రశాంత్ వర్మ మాత్రం అలాంటిదేం లేదు.. రాజశేఖర్ హీరోగా షూటింగ్ లో తన పని తాను చేసుకుపోవడమే కాదు.. ఒక నిర్మాతగా తనకేం కావాలో అనేవి దగ్గరుండి చూసుకుంటున్నారని చెబుతున్నాడు. మరి ఈ సినిమాని రాజశేఖర్.. మరో నిర్మాత సి కళ్యాణ్ తో కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మరి ఇదివరకు రాజశేఖర్ సినిమాల విషయంలో ఆయన భార్య జీవిత జోక్యం ఎక్కువుంటుందని..దర్శకులు అనేవారు. కానీ ఇక్కడ రాజశేఖర్ జోక్యం ఎక్కువైందనే టాక్ నడుస్తుంది. ప్రశాంత్ వర్మ అలాంటిదేం లేదన్నా.. నిప్పులేనిదే పొగరాదుగా అంటున్నారు కొందరు.