తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా బాపు-రమణల కాంబినేషన్‌లో వచ్చిన ‘అందాలరాముడు’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ లత. తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో పలు చిత్రాలలో కథానాయికగా నటించిన ఆమె తాజాగా మాట్లాడుతూ, నేను పుట్టి పెరిగింది చెన్నైలోనే. కానీ మాది కర్నూల్ జిల్లాలోని నాగలాపురం గ్రామం. సినిమాలలోకి రాకముందు నా పేరు నళిని. తమిళ సినీ పరిశ్రమలో అప్పటికే ఓ నళిని అనే నటి ఉండటంతో ఎంజీఆర్ గారు నా పేరును లతగా మార్చారు. పేరు మార్చుకున్న తర్వాత చాలా కాలం వరకు నన్ను ఎవరైనా లత అని పిలిస్తే పలికేదానిని కాదు. నా దగ్గరకు వచ్చి ఎవరైనా.. నిన్నే పిలిచేది అని చెబితే ఓహో నా పేరు లత కదా! అని అనుకునే దానిని. అలా కొత్తపేరుకు నేను అలవాటు పడటానికి చాలా సమయం పట్టింది.
నేను తొమ్మిదో తరగతి చదివేటప్పుడు స్కూల్‌లో ఓ డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొన్నాను. ఆ ఫొటో ఎంజీఆర్ కంటపడింది. ఆయన సూచన మేరకు ఆర్.ఎస్. మనోహర్ గారు మా అమ్మకు కాల్ చేశారు. ఎంజీఆర్ సినిమాలోకి కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారని, నన్ను సినిమాల్లోకి తీసుకుని రమ్మని అడిగారు. మా అమ్మాయి చదివేది ఇంకా నైన్త్‌క్లాసే. ఇప్పుడు సినిమాలలోకి వద్దు అని మా అమ్మ ఫోన్ పెట్టేసింది. మా పెద్దమ్మ మాత్రం నన్ను సినిమాలలో నటించమని ప్రోత్సహిస్తూ ఉండేది. రెండురోజుల తర్వాత మనోహర్‌గారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎంజీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఎంజీఆర్‌గారు మా అమ్మని ఒప్పించి, నన్ను తన చిత్రంలో హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ సినిమాతో నా సినీ కెరీర్ ప్రారంభమైంది.. అని చెప్పుకొచ్చింది.