సినిమాకి ఎంత ఖర్చు అయ్యిందనే విషయం చెప్పుకోవడానికి ఎంతో గొప్పగా ఫీల్ అయ్యే మన నిర్మాతలు.. అంతే గొప్పగా వచ్చిన లాభాల గురించి మాట్లాడుకోవడం ఎప్పుడో మానేశారు. అందుకు కారణం పెరుగుతున్న బడ్జెట్ పరిమితులు కావచ్చు లేదా పెరుగుతున్న హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ కావచ్చు.. ఈ మధ్య కాలంలో నిర్మాతల డబ్బు వృధాగా పోతోంది. కొందరు దర్శకులు తమ మార్కెట్ వేల్యూను కాదు కదా కనీసం హీరోల మార్కెట్ వేల్యూను కూడా పట్టించుకోకుండా నిర్మాతల చేత కోట్లకు కోట్లు ఖర్చు పెట్టించేస్తున్నారు. తాజాగా ఈ తరహాలో నిర్మాతల చేత భీభత్సంగా ఖర్చు పెట్టించిన దర్శకుడు హను రాఘవపూడి. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం పడి పడి లేచే మనసు బడ్జెట్ దాదాపు 30 కోట్లు దాటింది అంటున్నారు.
శర్వానంద్, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సినిమా మీద భారీ ఎక్స్ పేక్టేషన్స్ ఎవరికీ లేవు. అందులోనూ సంక్రాంతి సందడి మొదలయ్యేసరికి ఈ సినిమా ఎలాగూ థియేటర్లలో ఉండదు. అలాంటప్పుడు శర్వానంద్ మార్కెట్ కానీ.. అతడి క్రేజ్ కానీ దృష్టిలో పెట్టుకుంటే.. 20 కోట్లలోపు సినిమా తీస్తేనే నిర్మాతలు సేఫ్ అయ్యే ఛాన్స్ కొద్దో గొప్పో ఉంది. అందులోనూ మళ్ళీ ఇలాంటి డల్ సీజన్ లో సినిమా విడుదలై నిర్మాతలను సేఫ్ జోన్ లో పడేయడం అనేది సూపర్ హిట్ అయితే తప్ప జరగని పని.
అలాంటప్పుడు హను రాఘవపూడి ఏ నమ్మకంతో ఇలా కోట్లకు కోట్లు ఖర్చు చేయించాడు అనేది ఎవరికీ అర్ధం కాని విషయం. సినిమాల్ని చాలా కవితాత్మకంగా తెరకెక్కించే హను.. నిర్మాణ విలువల విషయంలోనూ కాసింత జాగ్రత్త వహించడం చాలా అవసరం. లెక్కకు మిక్కిలి రీ షూట్లు జరగడమే చిత్ర బడ్జెట్ పరిమితులు దాటి పోవడానికి కారణం అని యూనిట్ వర్గాలు చెప్పుకోవడం గమనార్హం.