అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టుగా ఉంటుంది మన టాలీవుడ్ పరిస్థితి. ఈ వారం సైతం పేరెన్నిక గల పలు చిత్రాలు ఇయర్ ఎండ్ క్లియరెన్స్ ద్వారా మన దగ్గరి థియేటర్స్ లో రిలీజుకు సిద్ధం అవుతున్నాయి. ప్రతీ వారం ఎదో రకంగా ఇటు వీక్షకుల పైనా, అటు సమీక్షకులు పైనా ప్రతీకారం తీసుకుంటున్న నిర్మాతలు ఈ వారం కాసింత ఊరటనిస్తూ ప్రామిసింగ్ సినిమాలను సైతం మూకుమ్మడిగా దించేస్తున్నారు.
శర్వానంద్, సాయి పల్లవిల పడి పడి లేచే మనసు పడుతూ లేస్తూ మొత్త్తంగా ఈ నెల 21న అంటే ఈ వారమే క్రిష్, వరుణ్ తేజ్ గార్ల అంతరిక్ష యాత్రకి పోటీగా దిగనుంది. రెంటికీ మార్కెట్లో పాజిటివ్ బజ్ ఉండడం నిర్మాతలకు అనుకూలించే అంశం. వీరిద్దరికి ఎదురుగా KGF అనే మాస్ యాక్షన్ డబ్బింగ్ చిత్రం విడుదలకు తయారయింది. సందులో సడేమియా అన్నట్టు ధనుష్ మారి 2 కూడా ఈ వారమే రానుంది.
ఇన్ని సినిమాలకు ఒకే వారం ఇంతలా అనుకూలించే అంశం ఏముందా అని ఆలోచించాల్సిన పని లేదు. 2018 ఆఖరుకి వచ్చేసింది కనుక తల మీద భారాలు దించుకోవాల్సిన గడ్డు పరిస్థితి నిర్మాతలది. పైగా కొత్త ఏడాది 2019 ప్రారంభం నుండి మొదలు సంక్రాంతి భారీ చిత్రాల హడావిడి మొదలవుతుంది. ఏ మాత్రం ఆలస్యం చేసినా అన్నీ ఫేడ్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఈ ఇయర్ ఎండ్ క్లియరెన్స్ మొదలైంది!