అత్యంత భయంకరమైన విలన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో రాజమౌళి తర్వాత బోయపాటే సిద్ధహస్తుడు. విలన్ ఎంత బలవంతుడైతే.. హీరో కూడా అదే స్థాయిలో ఎలివేట్ అవుతాడు అనేది బోయపాటి గట్టిగా నమ్ముతాడు. ఇక హీరోల చేత భీభత్సమైన ఫైట్లు చేయించి.. కుదిరితే తలకాయలు నరికించేసే బోయపాటి ప్రస్తుతం భయంతో జడుసుకుంటున్నాడు. దర్శక ఘనాపాటి బోయపాటి అంతగా భయపడాల్సిన పరిస్థితి ఎమొచ్చింది, అందులోనూ బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సపోర్ట్ తోపాటు తెలుగుదేశం పార్టీ అండ కూడా ఉంది కదా అనుకొంటున్నారా.
ఇక్కడ బోయపాటి భయపడుతున్నది ఏదో ప్రమాదం గురించి కాదు.. తన తాజా చిత్రమైన వినయ విధేయ రామ సినిమా పబ్లిసిటీ గురించి.
సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తున్నప్పటికీ.. రిలీజ్ కి సరిగ్గా నెల రోజులు మాత్రమే ఉన్నప్పటికీ.. ఇప్పటివరకూ దానయ్య అండ్ గ్యాంగ్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ ను మొదలెట్టలేదు. మొన్నామధ్య విడుదలైన చేసిన ఫస్ట్ సింగిల్ కి కూడా సరైన రెస్పాన్స్ రాలేదు. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా అయినప్పటికీ.. నిర్మాతలు కాస్తో కూస్తో ప్రమోట్ చేయకపోతే.. వినయ విధేయ రామ చిత్రానికి సరిగ్గా రెండు రోజుల ముందు విడుదలవుతున్న ఎన్టీఆర్ కథానాయకుడు వైపే జనాలు మొగ్గు చూపడం ఖాయం.
అయినా.. ఓ అగ్ర కథానాయకుడు నటిస్తున్న సినిమా అంటే కనీసం రెండు నెలల ముందు నుంచైనా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి. అలాంటిది ఏదో విడుదలకు రెండు వారాల ముందు మొదలెడతామంటే.. అది కూడా సంక్రాంతి లాంటి సీజన్ లో చాలా కష్టమవుతుంది. బోయపాటి కూడా ఇదే విషయంలో భయపడుతున్నాడు. మరి ఈ విషయాన్ని నిర్మాత దానయ్య ఇప్పటికైనా అర్ధం చేసుకొని ప్రమోషన్స్ కి బడ్జెట్ ఎలాట్ చేసి.. స్టార్ట్ చేస్తే బెటర్.