మొన్నటివరకూ ఆయన బ్యానర్ లో నటించడం కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూసిన స్టార్ హీరోలున్నారు. ఇక యంగ్ హీరోలైతే ఆయన బ్యానర్ లో నటిస్తే చాలు.. రెమ్యూనరేషన్ కూడా అవసరం లేదు అనుకున్నవాళ్లు కోకొల్లలు. అంత అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న దిల్ రాజుకి ఆయన సంస్థకి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చిపడింది. తమిళంలో ఘన విజయం సొంతం చేసుకోవడంతో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన "96" సినిమా తెలుగు రీమేక్ రైట్స్ దిల్ రాజు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తొలుత ఈ రీమేక్ లో నాని-సమంత నటిస్తారని టాక్ వచ్చినప్పటికీ.. నాని ఇదివరకే అదే తరహా చిత్రమైన "ఎటో వెళ్లిపోయింది మనసు"లో నటించి ఉండడం.. సమంత ఆసక్తి చూపకపోవడంతో ఆ కాంబినేషన్ సెట్ అవ్వలేదు.
ఈమధ్య గోపీచంద్ పేరు వినబడింది. నిజానికి ఆ కథ గోపీచంద్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో చేయాల్సిందే. దాంతో గోపీచంద్ పర్ఫెక్ట్ అనుకున్నారందరూ. కానీ.. ఏమైందో ఏమో తెలియదు కానీ.. గోపీచంద్ కూడా దిల్ రాజు ఆఫర్ ను కాదన్నాడట. దాంతో ఇప్పుడు ఈ రీమేక్ లో ఎవర్ని క్యాస్ట్ చేసుకోవాలో తెలియని కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతున్నాడు దిల్ రాజు.
మరో పక్క ఈ సినిమా ఒరిజినల్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్, హీరోయిన్ త్రిష రీమేక్ కోసం రెడీగా ఉండగా.. అగ్ర నిర్మాత అయిన దిల్ రాజు ఇప్పటివరకూ హీరోని సెట్ చేయకపోవడంతో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ వండర్ ఫుల్ లవ్ స్టోరీలో దిల్ రాజు హీరోగా ఎవర్ని తీసుకొంటాడు, సినిమా ఎప్పటికీ మొదలవుతుందో చూడాలి.