ఒకపక్క రజనీకాంత్ లాంటి సీనియర్ హీరో వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోయిన్స్ తో కూడా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటే.. మన మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన పక్కన హీరోయిన్ తన వయసుకి తగ్గట్లుగా ఉండాలని కోరుకుంటూ.. సగం ప్రీప్రొడక్షన్ వర్క్ హీరోయిన్ సెలక్షన్ కే సరిపెడుతున్నాడు. "సైరా" సినిమా విషయంలో హీరోయిన్ ని ఫిక్స్ చేయడానికే చాలా సమయం పట్టింది. అలాంటిది.. కొరటాల సినిమా విషయంలో అంతకుమించిన అంతర్మధనం చోటు చేసుకొందట. కొరటాల శ్రుతి హాసన్ పేరు తీసుకురాగా.. చిరంజీవి ససేమిరా అన్నాడట. దాంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో.. ఆల్రెడీ సైరాలో చిరంజీవితో జతకట్టిన నయనతారనే మళ్ళీ కొరటాల సినిమా కోసం కూడా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.
వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల అడిగితే నయనతార ఎలాగూ కాదనదు కాబట్టి.. ఇప్పటికే చిత్ర బృందం అందరూ ఈ సినిమాలో చిరంజీవికి నయనతారే జోడీ అని ఫిక్స్ అయిపోయారట.
అయితే.. సైరా సినిమా షూటింగ్ లేటవ్వడానికి నయనతార కూడా ఒక ముఖ్యకారణంగా నిలిచింది. ప్రియుడితో హాలీడే ట్రిప్ కు వెళ్లడానికి "సైరా" షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడమే కాక.. ఒక నాలుగు రోజుల ఎక్స్ట్రా కాల్షీట్ కోసం చిత్ర బృందాన్ని చాలా ఇబ్బందులు పెట్టింది. మరి చిరు మళ్ళీ ఆమెతో నటించడానికి ఎలా ఒప్పుకున్నాడో ఏమో.