నిన్న విడుదలైన "అంతరిక్షం" ట్రైలర్ చూసి అందరు హాలీవుడ్ స్థాయి విజువల్స్ ఉన్నాయి, వి.ఎఫ్.ఎక్స్ వర్క్ అదిరింది అని చప్పట్లు కొడుతున్నారు. కానీ.. ఈ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ వెనుక ఓ మహా యుద్ధమే జరిగిన విషయం ఎవరికీ తెలియదు. నిజానికి అంతరిక్షం ఫస్ట్ గ్రాఫిక్స్ అవుట్ పుట్ ఇలా రాలేదట. క్రిష్ తనకు తెలిసిన తరహాలో తక్కువ బడ్జెట్ లో సినిమాను పూర్తి చేయాలనుకున్నాడట. కానీ.. దర్శకుడు సంకల్ప్ రెడ్డి మాత్రం ససేమిరా ఒప్పుకోలేదట. కావాలంటే ప్రొజెక్ట్ నుంచైనా తప్పుకుంటా కానీ.. పొరపాటున కూడా ఈ చీప్ అవుట్ పుట్ తో సినిమాను పూర్తి చేయనివ్వను అని మొండిగా క్రిష్ తో గొడవపడ్డంత పని చేశాడట.
హీరో వరుణ్ తేజ్ కూడా సంకల్ప్ ని సపోర్ట్ చేయడంతో.. శాతకర్ణి తరహాలో చుట్టేద్దామనుకున్న క్రిష్ వేరే దారి లేక సంకల్ప్ రెడ్డి కోరిన వి.ఎఫ్.ఎక్స్ టీం తోపాటు కొంచెం ఎక్కువ బడ్జెట్ ను కూడా ఇచ్చాడట. అందుకే.. అంతరిక్షం అవుట్ పుట్ ఈ స్థాయిలో ఉంది. పెద్ద డైరెక్టర్ కదా ఆయనతో గొడవ ఎందుకులే అని సంకల్ప్ సర్ధుకుపోయి ఉంటే అవుట్ పుట్ ఇలా ఉండేది కాదు.
దర్శకుడిగా తొలి చిత్రంతోనే నేషనల్ అవార్డ్ అందుకున్న సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంతరిక్షంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ తెలుగులో తెరకెక్కిన మొట్టమొదటి స్పేస్ ఫిలిమ్ కావడంతో నిన్నమొన్నటివరకూ హాలీవుడ్ స్పేస్ ఫిలిమ్స్ చూసి మురిసిపోయిన ప్రేక్షకులందరూ ఈ తెలుగు స్పేస్ ఫిలిమ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.