రాజకీయాలకు దూరంగా వుంటూ వస్తున్న నాగబాబు తాజాగా హీరో బాలకృష్ణపై అతనెవరో తనకు తెలియదంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బాలకృష్ణ అంటే ఎవరో తనకు తెలియదని ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన నాగబాబు ఆ తరువాత `ఐయామ్ సారీ, నేను తన గురించి మాట్లాడను అని చెప్పడం కొత్త వివాదానికి దారితీస్తోంది. అయితే నాగబాబు ఏం ఆశించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు? వాటివెనక వున్న ఉద్దేశమేంటి?. ఎప్పుడూ వివాదాలకు దూరంగా వుండే నాగబాబు వున్నట్టుండి బాలయ్య తనకు తెలియదంటూ కామెడీ ఎందుకు చేస్తున్నాడు? అన‌్నది మెగా అభిమానులకు అంతుచిక్కడం లేదట.
జనసేన వర్గాలకు మాత్రం నాగబాబు చేసిన వ్యాఖ్యల పట్ల ఫుల్ క్లారిటీ వుందని తెలిసింది. కారణం ఏంటంటే గత ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ను వాడుకున్న టీడీపీ ఆ తరువాత కరివేపాకులా తీసి పక్కన పెట్టేసింది. దాంతో ఆగ్రహించిన జనసేనాని టీడీపీపై విరచుకుపడటం మొదలుఎట్టాడు. దానికి కౌంటర్‌గా బాలకృష్ణ ఇటీవల చలోక్తులు విసరడం నాగబాబుకు ఆగ్రహాన్ని తెప్పించిందట. ఒంటరైపోతున్న తమ్ముడికి నైతికంగా సపోర్ట్‌గా నిలవాలన్న ఆలోచన కారణంగానే బాలయ్యను నాగబాబు టార్గెట్ చేశాడని, దీని ద్వారా తాను రాజకీయాల్లో ఇక నుంచి క్రియాశీలంగా పాల్గొనబోతున్నాననే సంకేతాల్ని అందించాడని మెగా వర్గాల్లో వినిపిస్తోంది.
ఇదిలా వుంటే నాగబాబు రూపంలో తమ నాయకుడికి సపోర్ట్ దొరికిందని జనసైనికులు ఆనందంపడుతుంటే నందమూరి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో నాగబాబును ట్రోలింగ్ చేస్తున్నారు. సినీ రంగంలో గత మూడు దశాబ్దాలుగా పోటీపడుతున్న మెగా, నందమూరి వర్గాలు తాజా ఉదంతంతో రాజకీయ శత్రువులుగా మారుతుండటం ఇండస్ట్రీ వర్గాలని కలవరానికి గురిచేస్తోంది. ఈ వైరం ఇలాగే కొనసాగి పెను తుఫానుగా మారితే అది రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న`ఆర్ ఆర్ ఆర్`కు పెద్ద చేటుగా పరిణమించే ప్రమాదం లేకపోలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.