ఈ శుక్రవారం 2.ఓ ని దాటుకుని నాలుగు సినిమాలు బాక్సాఫీసు వద్ద హడావిడి చేశాయి. తెలంగాణ ఎన్నికలను సైతం లెక్కచెయ్యకుండా బరిలోకి దిగిన ఆ నాలుగు చిత్రాల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. బెల్లంకొండ శ్రీనివాస్ - కాజల్ - మెహ్రీన్‌లు కలిసి నటించిన కవచం సినిమాకి ప్రేక్షకులనుండి, రివ్యూ రైటర్స్ నుండి కూడా నెగెటివ్ మార్కులే పడ్డాయి. కవచం సినిమా మొత్తం బెల్లంకొండ శ్రీనివాస్‌ని హైలెట్ చేస్తూనే హీరోయిజాన్ని చూపిస్తూ పోయాడు దర్శకుడు. ఇక టాప్ హీరోయిన్ కాజల్ అలాగే మీడియం రేంజ్ హీరోయిన్ మెహ్రీన్‌లు కేవలం అందాల ఆరబోత, గ్లామర్ డాల్స్ గానే మిగిలారు తప్ప.... వారి కేరెక్టర్స్ కి అసలు ప్రాధాన్యత లేదు. ఇక ఈ సినిమా కథ మరీ రొటీన్ గా ఉండడం, డైరెక్షన్ లోపాలు, మ్యూజిక్‌లో పస లేకపోవడం అన్ని కవచం సినిమాని కనీసం యావరేజ్‌గా కూడా నిలబెట్టలేకపోయాయి. బెల్లంకొండ గత సినిమాల్తో పోలిస్తే ఈ సినిమా డిజాస్టర్ అవడం మాత్రం ఖాయంగా కనబడుతుంది.
ఇక తమన్నా గ్లామర్ తోనే సినిమా ఆడేస్తుందని భ్రమపడిన నెక్స్ట్ నువ్వే దర్శకుడు.. కూడా ఈ వారం ఫెయిల్ అయ్యాడు. సందీప్ కిషన్ హీరోగా తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిన నెక్స్ట్ నువ్వే సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఒక సినిమాని చెడగొట్టడం అంటే ఎలా ఉంటుందో ఉదాహరణకు నెక్స్ట్ నువ్వే చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాని దర్శకుడు అంత బోరింగ్‌గా తెరకెక్కించాడు. అసలు నెక్స్ట్ నువ్వే కథ ని చూస్తే బాబోయ్ అనాలనిపిస్తుంది. సందీప్ కిషన్ నటన గాని, తమన్నా నటన గాని, గ్లామర్ గాని ఎక్కడా ఆకట్టుకున్న సందర్భమే లేదు. ఆ సినిమాలో కాస్తో కూస్తో పర్వాలేదనిపించింది కేరెక్టర్ కేవలం నవదీప్ మాత్రమే. బోరింగ్ కథ, చిరాకు పుట్టించే స్క్రీన్‌ప్లే...అసలేమీ ఆకట్టుకోలేని సాంకేతిక వర్గం అన్ని నెక్స్ట్ నువ్వేకి మరోరకంగా కలిసొచ్చాయి. అసలు ఈ కథతో దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? అనేది ఎంత ఆలోచించినా బుర్రకెక్కదు. అందుకే క్రిటిక్స్ ఈ సినిమాని చీల్చి చెండాడారు. మినిమమ్ మార్కులు కూడా వెయ్యకుండా డిజాస్టర్ మార్కులేశారు.
ఇక ఈ వారం మరో చెప్పుకోదగిన చిత్రం సుమంత్ - ఈషా రెబ్బల సుబ్రమణ్యపురం. ఈ సినిమా కథలో కొత్తదనం ఉన్నా... దర్శకుడు కథనంలో తప్పటడుగు వెయ్యడం... ఈ కథని గతంలో వచ్చిన కార్తికేయ సినిమాతో ముడిపెట్టడంతో.. ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి తగ్గింది కానీ.. లేదంటే ఈ సినిమా సస్పెన్సు థ్రిల్లర్ గా క్లిక్ అయ్యేది. సుమంత్ నటన బావున్నప్పటికీ.. హీరోయిన్ ఈషా తో కలిసి రొమాంటిక్ సీన్స్‌లో తేలిపోయాడు. ఇక నేపధ్య సంగీతం బాగున్నప్పటికీ.. మ్యూజిక్ ఆకట్టుకోలేకపోయింది. అలాగే ఈ సినిమాకి మెయిన్ గా నిర్మాణ విలువలు లోపం. నిర్మాతలు చూసి చూసి ఖర్చు పెట్టినట్టుగా ప్రతి ఫ్రేమ్‌లోను తెలిసిపోతుంది. ఇక మరో సినిమా శుభలేఖలు ఏ థియేటర్ లోకొచ్చిందో కూడా ప్రేక్షకుడి కనీస సమాచారం కూడా లేదు. మరి పైన చెప్పిన మ్యాటర్ తో ఈ వారం గెలుపెవరిదో మీరే డిసైడ్ చేయండి.