అఖిల్ అక్కినేని ప్రస్తుతం.. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘మిస్టర్ మజ్ను’ సినిమా చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులమీద ఫోకస్ పెట్టింది. అఖిల్ సరసన నిధి అగర్వాల్ నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇక వచ్చే నెల చివరి వారంలో విడుదలకు సిద్దమవుతున్న ఈ ‘మిస్టర్ మజ్ను’ ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైంది. అందులో మొదటిగా శాటిలైట్ హక్కులు అమ్ముడు పోయినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ‘మిస్టర్ మజ్ను’ మీద అఖిల్ గత చిత్రాల ఎఫెక్ట్ పడినట్లుగా అనిపిస్తుంది.
అఖిల్ నటించిన ‘అఖిల్, హలో’ చిత్రాలు అంతంతమాత్రంగా ఆడడంతో.. ప్రస్తుతం అఖిల్ మూడో చిత్రమైన ‘మిస్టర్ మజ్ను’పై ఆ ఎఫెక్ట్ పడినట్లుగా శాటిలైట్ హక్కుల ధర చూస్తే తెలుస్తుంది. మరి ఇక్కడ దర్శకుడి ‘తొలిప్రేమ’ సూపర్ హిట్ మ్యాజిక్ కూడా పని చెయ్యలేదు అనిపిస్తుంది. ‘హలో’ చిత్రమప్పుడే జీ ఛానల్ వారు ఐదు కోట్లకి శాటిలైట్ హక్కులను దక్కించుకుంటే.. ఇప్పుడు ‘మిస్టర్ మజ్ను’కి కూడా సదరు ఛానల్ ఐదు కోట్లకు తెగ్గొట్టేసినట్లుగా టాక్. మిస్టర్ మజ్ను శాటిలైట్ హక్కుల కోసం పలు ఛానల్స్ పోటీపడినా చివరికి జీ ఛానల్ వారే ఐదు కోట్లకి మిస్టర్ మజ్ను హక్కులను సొంతం చేసుకున్నట్లుగా టాక్.
ఇక అఖిల్ గత సినిమాల రిజల్ట్, నిధి అగర్వాల్ సవ్యసాచి ప్లాప్ ఇలా సినిమా మీద అంచనాలు తగ్గడానికి కారణమైతే.. వెంకీ అట్లూరి దర్శకత్వం, థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, నిర్మాత ఖర్చు అన్నీకలిపి సినిమా మీద హైప్ క్రియేట్ చేసేలా కనబడుతున్నాయి. అఖిల్ కి మార్కెట్ పరంగా ఎలాగున్నా.. అక్కినేని వారసుడు కాబట్టి అతని సినిమాలకు ఆటోమాటిక్‌గా విడుదల సమయానికి రావాల్సిన క్రేజ్ అయితే వచ్చేస్తుంది.