పెళ్ళిచూపులు పూర్తయ్యాకో లేక అర్జున్ రెడ్డి రిలీజ్ కి ముందో మాచో హీరో విజయ్ దేవరకొండ మాంచి నక్క తోక వెతుక్కొని మరీ తొక్కినట్లున్నాడు. అందుకే మనోడి వెనుక అదృష్టం హచ్ కుక్కపిల్లకంటే దారుణంగా తిరుగుతోంది. సాధారణంగా ఏ హీరోకైనా హిట్ ఫ్లాపు అనేది సర్వసాధారణం. కానీ విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం ఫ్లాప్ అయితే డిజాస్టర్ ఖాతాలోకి వెళ్లిపోతుంది, హిట్ అయితే మాత్రం రికార్డ్స్ బ్రేక్ చేసేస్తోంది. విజయ్ దేవరకొండ హిట్ కొట్టడానికిఅదృష్టం కలిసి రావడానికి లింక్ ఏంటా అని ఆలోచిస్తున్నారా అక్కడికే వస్తున్నా.
విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం టాక్సీవాలా విడుదలవ్వడానికి ఎన్ని ఇబ్బందులు పడిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ అవుతుందని విజయ్ దేవరకొండ వీరాభిమానులు కూడా ఎక్స్ పెక్ట్ చేయలేదు. అలాంటిది ఆ సినిమా ఏకంగా రెండువారాలపాటు విశేషంగా నడవడమే కాక ఆల్రెడీ 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఈ స్పీడ్ 2.0 విడుదల తర్వాత తగ్గుతుంది అనుకున్నారు ట్రేడ్ పండితులు. అందులోనూ విడుదలైన రోజు 2.0కి వచ్చి క్రేజ్ మరియు రివ్యూస్ చూసి ఇక టాక్సీవాలాను థియేటర్ల నుంచి తప్పించినట్లే ఆనుకున్నారు.
కట్ చేస్తే 2.0 3D స్క్రీన్స్ లో చేస్తున్నంత హల్ చల్ సింగిల్ స్క్రీన్స్ లో చేయడం లేదు. దాంతో సింగిల్ స్క్రీన్స్ లో విజయ్ దేవరకొండ టాక్సీవాలా మళ్లీ చెలరేగిపోతున్నాడు. మూడోవారంలోను టాక్సీవాలాకి కొత్త థియేటర్లు జత చేసినా, 70 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండడం విశేషం. ఈ చిత్రం కొన్న ట్రేడ్ వర్గాల్లో ఆనందం డబుల్ అయింది.