జక్కన్న పుణ్యమా అని `బాహుబలి` తరువాత దర్శకులతో పాటు నిర్మాతల్లోనూ బడ్డెట్ పరంగా ధైర్యం ఏర్పడింది. దక్షిణాది సినిమా మార్కెట్ పరిధిని పెంచడంతో గతంలో భారీ చిత్రాలు నిర్మించాలని అనుకుని వాటిని పక్కన పెట్టిన దర్శకులు ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో కొత్త తరహా భారీ బడ్జెట్ చిత్రాలకు శ్రీకారం చుడుతున్నారు. గత కొంత కాలంగా తన మదిలో మొదులుతున్న కథకు బడ్జెట్, మార్కెట్ పరిధి కారణంగా కార్యరూపం దాల్చలేకపోయిన మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో మోహన్‌లాల్ హీరోగా `మరక్కార్ అరబ్బికడలైంట్ సింహం` పేరుతో ఓ చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నాడు.
ఆంటోని పెరుంబువార్ నిర్మిస్తున్న ఈ చిత్రం పిరియాడిక్ డ్రమాగా రూపొందనుంది. 16వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి కుంజలి మరక్కార్ జీవిత కథ ఆధారం. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మితం అవుతున్న ఈ సినిమాలో మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ అతిథి పాత్రలో మెరవనున్నాడు. ఇతర కీలక పాత్రల్లో కీర్తి సురేష్, సునీల్‌షెట్టి, ప్రభు, మంజు వారియర్, అర్జున్, కల్యాణి ప్రయదర్శన్, ముఖేష్ నటిస్తున్నారు. ఈ నెల 1 నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. కళాదర్శకుడు సాబూ సిరిల్ నేతృత్వంలో ఈ చిత్రం కోసం భారీ షిప్‌లను రూపొందిస్తున్నారు. మలయాళ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నసినిమా ఇదే.
1996లో వచ్చిన `కాలాపానీ` చిత్రం అనంతరం సుదీర్ఘ విరామం తరువాత ప్రియదర్శన్, మోహన్‌లాల్, ప్రభు కలిసి నటిస్తున్న చిత్రమిది. 2019 ద్వితీయార్థం వరకు చిత్రీకరణ పూర్తిచేసి అత్యధిక శాతం వీఎఫ్ఎక్స్ కోసం కేటాయించనున్నారు. అనుకున్న సమయానికి పూర్తయితే చిత్రాన్ని 2020 ప్రధమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.