కల్యాణ్‌రామ్ నిర్మించిన `కిక్-2` నుంచి మాస్ రాజా టైమ్ కలిసి రావడంలేదు. వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అయినా అతనితో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు వెనుకాడటం లేదు. ఇప్పటికే ఈ ఏడాది రవితేజ ఖాతాలో `టచ్ చేసి చూడు`, `నేల టిక్కెట్` తాజాగా `అమర్ అక్బర్ ఆంటోని` వంటి డిజాస్టర్‌లు వచ్చిపడ్డాయి. అయినా మాస్ రాజా రవితేజ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నెలలో ఓ సినిమాను పట్టాలెక్కిస్తున్నరవితేజ జనవరిలో మరో చిత్రాన్ని కూడా మొదలుఎట్టేసేందుకు రెడీ అయిపోతున్నాడు.
ఈ సారి మురుగదాస్ శిష్యుడైన వి.ఐ.ఆనంద్ని నమ్ముకున్నాడు. వీరిద్దరి కలయికలో `నేల టిక్కెట్` ఫేమ్ రామ్ తాళ్లూరి ఓ సినిమా చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరమైన కథతో ఈ చిత్రాన్ని వి.ఐ.ఆనంద్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. కావాల్సిన గ్లామర్‌ని జోడించి ఈ సినిమాతో ఈ సారి గట్టి హిట్‌ని కొట్టాలనే కసితో రవితేజ ఉన్నట్లు చెబుతున్నారు. `డిస్కోరాజా` అనే పేరుతో రూపొందనున్నఈ సినిమాలో మాస్ రాజాకు జోడీగా ముగ్గుకు గ్లామరస్ హీరోయిన్‌లు నటించబోతున్నారు.
`ఆర్ ఎక్స్ 100` సినిమాతో యువతను షాక్‌కు గురిచేసిన పాయల్ రాజ్‌పుత్ ఓ హీరోయిన్‌గా నటించనుండగా మరో నాయికగా `నన్ను దోచుకుందువటే` ఫేమ్ నభా నటేష్‌ను ఎంపిక చేశారు. ఇక మూడవ నాయికగా `టాక్సీవాలా` ఫేమ్ ప్రియాంక జవాల్కర్ నటించనుంది. ముగ్గురు కలర్‌ఫుల్ నాయికలతో ఈ చిత్రాన్నిఈ నెల 12న మొదలుపెడుతున్నాడు రవితేజ. తను కోరుకున్నట్టే ఈ సినిమాతో గట్టి సక్సెస్‌ని సొంతం చేసుకుని మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడో చూడాలి.