శంకర్ - రజినీకాంత్ కాంబోలో తెరకెక్కిన రోబో సీక్వెల్ 2.ఓ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా 10000 కి పైగా స్ర్కీన్లలో విడుదలైంది. 2.ఓ విడుదలైన మొదటి షోకే పాజిటివ్ టాక్ పడింది. ప్రేక్షకులు తలో ఒక మాట చెప్పినప్పటికీ.. 2.ఓ సినిమా ఓవరాల్ గా బావుందని టాక్ ఈవెనింగ్ కి స్ప్రెడ్ అయ్యింది. శంకర్ ఈ సినిమాని విజువల్ వండర్ గా తీర్చిదిద్దాడని అన్నారు. ఈ సినిమాలో లూజ్ పాయింట్స్ ఎన్ని అయితే ఉన్నాయో.... ప్లస్ పాయింట్స్ కూడా అన్నే ఉన్నాయి. భారీ అంచనాల నడుమ భారీగా విడుదలైన 2.ఓ చిత్రంలో రజినీకాంత్ నటన, అక్షయ్ కుమార్ నటన అలాగే రజిని - అక్షయ్ మధ్యన వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని అదుర్స్ అనే రేంజ్ లో ఉండడమే కాదు.. ఏఆర్ రెహ్మాన్ అందించిన నేపధ్య సంగీతం కూడా 2.ఓ ని ఉన్నత శిఖరాన నిలిపాయనడంలో సందేహమే లేదు.
అలాగే నీరవ్ షా సినిమాటోగ్రఫీ అయితే సినిమా మొత్తానికే హైలెట్ అనేలా ఉంది. ఇక ఫుడ్ బాల్ స్టేడియంలో సెట్ చేసిన క్లైమాక్స్ సన్నివేశాలైతే సినిమాకే ఆయువు పట్టు. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ కూడా ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కాగా... నిర్మాతలు పెట్టిన ప్రతి రూపాయి... ప్రతి సీన్ లోని భారీ తనంతో కట్టిపడేసింది. ఇక కేవలం ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉంటే సరిపోదు.. సగటు ప్రేక్షకుడికి కథ కూడా అవసరమే అనేలా ఉంది 2.ఓ పరిస్థితి. మరి ఎప్పుడూ కథకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన శంకర్ ఈసారి మాత్రం 2.ఓ లో కథ కన్నా ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ కే ఇంపార్టెన్స్ ఇచ్చాడనిపిస్తుంది. స్క్రీన్ ప్లే లో కూడా శంకర్ మార్క్ కనబడలేదు. రజినీకాంత్ స్టార్ డం కి లోబడి కొన్ని సీన్స్ ని శంకర్ రాసుకున్నాడా అనిపిస్తుంది. అలాగే చాలా సీన్స్ లాగింగ్ అనిపిస్తాయి.
2.ఓ సినిమా మొత్తం చాలా సీరియస్ గా సాగుతూ ఉండటం వల్ల.. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులు కొంత బోర్ ఫీల్ అవుతారు. ఇక ఎడిటింగ్ లో కూడా చాలా కత్తెర్లు పడాల్సింది. వశీకర్‌లో పక్షిరాజు ఆత్మ చేరిన తరవాత.. కొన్ని సీన్లు కత్తిరించారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. రోబోలో కామెడీ, ఎమోషన్, రొమాన్స్, ప్రేమానుబంధాలు అన్ని ఆకట్టుకుంటే.. ఈ 2.ఓ లో మాత్రం అవేం మచ్చుకైనా కనబడవు. మరి ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ తో సమానంగా మైనస్ లు ఉన్నప్పటికీ....ఈ సినిమాకి రివ్యూ రైటర్స్ మాత్రం.. అందరు కలిసి ఒకే రేటింగ్ ఇద్దామనుకున్నారో ఏమో తెలియదు కానీ... అందరూ కలిసి కట్టుగా ఓవరాల్ గా 3 పైన రేటింగ్స్ ఇచ్చేసి శంకర్ ని రజినీకాంత్ ని గట్టెక్కించేసారు.